ఆదిలాబాద్ : రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్న నకిలీ పత్తి విత్తనాల ( Fake Cotton Seed ) అంతరాష్ట్ర ముఠా ( Inter-state Gang ) ను ఆదిలాబాద్ ( Adilabad ) పోలీసులు పట్టుకున్నారు.
పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రధాన నిందితుడుతో పాటు తొమ్మిదిపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నకిలీ పత్తి విత్తనాలు, అనుమతులు లేని పురుగుమందులు, ఎక్స్పైర్డ్ విత్తనాలు, తయారీ సామగ్రి, కారు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ( SP Akhil Mahajan ) సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
792 ప్యాకెట్ల పింక్ బాండ్ పత్తి విత్తనాల ప్యాకెట్లు , రూ. 9.5 లక్షల విలువ చేసే గడువుతీరిన విత్తనాలు, మందులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లో కొత్తపేటలో అగ్రిటెక్, జీనియస్ క్రాప్ సైన్సెస్ యజమాని పాపిన్వర్ సునీల్ కుమార్‌ను అరెస్టు చేశామని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన రాథోడ్ పండిత్ , రాథోడ్ బాలాజీ , గుజరాత్‌కు చెందిన గిరీష్ పటేల్, ఆదిలాబాద్‌కు చెందిన ఈశ్వర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వివరించారు. గణేష్ , కృష్ణ ,కిరణ్, సందేశ్ బండేవర్ అనే మరో నలుగురు పరారీలో ఉన్నారని తెలిపారు .
రైతులను మోసం చేసి అక్రమ లాభాల కోసం నకిలీ విత్తనాల వ్యాపారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్స్పెక్టర్ కే నాగరాజు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సైలు అఖిల్, గోపికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.