ముంబై: లీగ్ ఆరంభంలో రెండు పరాజయాలు ఎదురైనా.. వెంటనే తేరుకొని గెలుపు బాట పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్ధమవుతున్నది. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో విలియమ్సన్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. టాపార్డర్ జోరు మీదుండటం రైజర్స్‌కు కలిసొచ్చే అంశం కాగా.. గుజరాత్ టైటాన్స్‌పై విజయం జట్టు ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, విలియమ్సన్ మంచి ఫామ్‌లో ఉండగా.. మిడిలార్డర్లో మెరుపులు మెరిపించేందుకు పూరన్, మార్క్మ్ రెడీగా ఉన్నారు. గత నాలుగు మ్యాచ్‌ల్లో బంతితో చక్కటి ప్రదర్శన కనబర్చిన వాషింగ్టన్ సుందర్ గాయపడటం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. మరో రెండు మ్యాచ్‌ల వరకు సుందర్ అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో.. అతడి స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. శ్రేయస్ గోపాల్, జగదీశ సుచిత్, అబ్దుల్ సమద్లో ఒకరు తుది జట్టులోకి రావొచ్చు. బౌలింగ్‌లో భువనేశ్వర్, నటరాజన్ మరోసారి కీలకం కానుండగా.. మార్కో జెన్సెన్ వారికి చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఇక ఉమ్రాన్ మాలిక్ వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. మరోవైపు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడింట నెగ్గి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కతా.. టాప్కు చేరాలని తహతహలాడుతున్నది. గత మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన శ్రేయస్ సేన తిరిగి గెలుపు బాట పట్టేందుకు కసరత్తులు ప్రారంభించింది. రహానే, వెంకటేశ్, శ్రేయస్, నితీశ్, బిల్లింగ్స్, రస్సెల్, కమిన్స్, నరైన్‌తో కూడిన బ్యాటింగ్ లైనప్‌ను నిలువరించాలంటే హైదరాబాద్ బౌలర్లు శక్తికి మించి పోరాడాల్సిందే!