న్యూఢిల్లీ, జూన్ 13: ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మరో స్పోర్ట్స్ బైకును దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. హోండా గోల్డ్ వింగ్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.44.30 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. 1,833 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో తయారైన ఈ బైకు 6 సిలిండర్ ఇంజిన్, 124 బీహెచ్పీ శక్తినివ్వనుండగా, ఏడు స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్లు, డ్యూయల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, విండోస్క్రీన్ను ఎటైనా మార్చుకునే విధంగా డిజైన్ చేసింది. అలాగే ఏడు ఇంచుల టీఎఫ్టీ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, సౌండ్ సిస్టమ్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఎయిర్‌బ్యాగ్ కలిగిన స్పోర్ట్స్బైకు ఇదే కావడం విశేషం. వీటితోపాటు ఈ-క్లచ్ మాడళ్లను కూడా తీసుకొచ్చింది. 471 సీసీ నుంచి 755 సీసీ ఇంజిన్‌తో తయారైన ట్విన్-సిలిండర్ ఇంజిన్ కలిగిన ఈ బైకులు రూ.10.49 లక్షల నుంచి రూ.13.20 లక్షల లోపు లభించనున్నాయి.