న్యూఢిల్లీ : వర్షాకాలంలో సీజనల్ ఫ్లూ, ఇతర వ్యాధుల ముప్పు పొంచిఉండటంతో ఆరోగ్యకర అలవాట్లు, జీవనశైలి మార్చుకోవడం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ సీజన్లో అన్ని రకాల శ్వాసకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాటితో పాటు ఇన్ఫ్లుయంజ, స్వైన్ఫ్లూ వంటి వైరస్లు విజృంభిస్తాయని వీటన్నింటి లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లునొప్పులు వంటివి ఒకేలా ఉంటాయని ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవి శేఖర్ ఝా చెబుతున్నారు.
వయో సంబంధ సమస్యలు, సరైన రోగనిరోధక శక్తి కొరవడితే స్వల్ప వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా ఒక్కోసారి ప్రమాదకరంగా మారతాయని బయటి ఆహారం తీసుకోవడం, నీరు తాగడం వంటివి అవాయిడ్ చేయాలని షాలోం దవాఖానా వైద్య నిపుణులు డాక్టర్ మోనరోలా హెచ్చరించారు.
ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించేందుకు తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, ప్రతిరోజూ ప్రొటీన్ ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. నీరు ఎక్కువగా తాగడంతో పాటు అధికంగా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని చెప్పారు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇచ్చేందుకు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రించాలని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు వ్యాయామం చేయాలని చెబుతున్నారు.