హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఒకవైపు విద్యుత్ కోతలు, మరోవైపు బిల్లులు పెంచుతూ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ వాతలు పెడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. దసరా, దీపావళి పండుగల వేళ ప్రజలకు శుభవార్త చెప్పాల్సిన ప్రభుత్వం.. ట్రూ-అప్ చార్జీల పేరుతో రూ.5,420 కోట్ల భారం మోపేందుకు సిద్ధమైందని ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లకు వెచ్చించిన మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూ లు చేయడం సమంజసం కాదని, ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజలను బాధ్యులను చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేగణేశ్ బిగాల, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ట్రూ-అప్ పేరుతో ప్రజలపై మోపే విద్యుత్ బిల్లులను వెంటనే ఉపసంహరించుకొని చార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరించారు. బీఆర్ఎస్ చేసే పోరాటంలో కమ్యూనిస్టులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజలు కలిసిరావాలని హరీశ్‌రావు కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో విద్యుత్‌రంగాన్ని బలోపేతం చేసిందని హరీశ్‌రావు తెలిపారు. సుమారు రూ.91 వేల కోట్లతో జెన్కో, ట్రాన్స్‌కోతోపాటు విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేశామని చెప్పారు. 400 కేవీ సబ్స్టేషన్లు 6 నుంచి 30కి, 220 కేవీ సబ్స్టేషన్లు 51 నుంచి 103కి, 132 కేవీ సబ్స్టేషన్లు 176 నుంచి 251కి పెంచామని వివరించారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 7,778 నుంచి 19,450 మెగావాట్లకు పెంచి తెలంగాణను ‘పవర్ ఫుల్ ’ రాష్ట్రంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. కొత్తగూడెంలో 800, భద్రాద్రిలో 1,080, భూపాలపల్లిలో 600, యాదాద్రిలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లను నిర్మించామని తెలిపారు. థర్మల్‌లో 6,480 మెగావాట్లు, సోలార్‌లో 3,600 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా అందుబాటులోకి తెచ్చామని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక సబ్‌స్టేషన్ కూడా నిర్మించలేదని, ఒక మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచలేదని హరీశ్‌రావు విమర్శించారు. గతంలో 24గంటల కరెంట్ ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు కోతలు ఎందుకు వచ్చాయని నిలదీశారు. భద్రాద్రి, యాదాద్రి, సింగరేణి, కేటీపీఎస్ వంటి విద్యుత్ కేంద్రాలను పూర్తి సామర్థ్యంతో ఎందుకు నడుపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర థర్మల్ విద్యుత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 13,384 మెగావాట్లు కాగా, 8వేల మెగావాట్లు కూడా ఉత్పత్తి చేయడం లేదని ఆరోపించారు. నైనీలో బొగ్గు ఉన్నా కమీషన్ల కోసం విదేశాల నుంచి అధిక ధరలకు బొగ్గు దిగుమతి చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
ట్రాన్స్‌కోలో 26శాతం వాటాల విక్రయ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ట్రూ-అప్ చార్జీల కింద రూ.12,718.40 కోట్ల భారం మోపాలని ఈఆర్సీ సూచించినా ప్రజలపై భారం వేయడానికి కేసీఆర్ అనుమతించలేదని గుర్తుచేశారు. నాడు చంద్రబాబు అడ్డగోలుగా చార్జీలు పెంచి బషీర్‌బాగ్ కాల్పుల దాకా తెచ్చారని మండిపడ్డారు. అప్పుడు విద్యుత్ బిల్లులపై పోరాటం చేసిన కమ్యూనిస్టులు, ఇవాళ రేవంత్‌రెడ్డి చేసే పాపంలో పాల్పంచుకోవద్దని, బీఆర్ఎస్ చేసే పోరాటంలో కలిసి రావాలని కోరారు.