కాన్పూర్ : రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ఇన్ని రోజులకు రాంనాథ్ కోవింద్ తాను పుట్టిన ఊరు పరాంఖ్కు వెళ్లారు. గ్రామంలోకి అడుగుపెట్టగానే భూమాతకు నమస్కారం చేశారు. మట్టిని చేత్తో తీసుకుని నుదుటిపై రాసుకున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆ గ్రామంలో తన చిన్ననాటి మిత్రులు, సహావిద్యార్థులు, తనతో కలిసి పార్టీ కార్యక్రమాలు చేపట్టిన వారితో సమావేశమై గత స్మృతులను నెమరేసుకున్నారు. తనతో కలిసి చదువుకున్న పలువురిని పేర్లతో పిలిచి వారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గ్రామంలోని పత్రి మాతా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ జిల్లా పరిధిలో ఉన్న పరాంఖ్ గ్రామానికి కాన్పూర్ నుంచి ప్రత్యేక అధ్యక్ష రైలులో చేరుకున్నారు. తమ గ్రామస్థుడు భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నికై సేవలందించడాన్ని ఆ ఊరి ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు. కోవింద్‌ను కలిసేందుకు గ్రామస్థులు గత రెండు రోజులుగా ప్లాన్ చేసుకుంటున్నారు. భారత రాష్ట్రపతి తమ గ్రామానికి వస్తుండటంతో గ్రామస్థులు ఎంతో సంతోషపడుతున్నారు.
ఒక మారుముల గ్రామానికి చెందిన తనలాంటి ఒక సాధారణ కుర్రాడు ఇంత పెద్ద దేశానికి చెందిన అత్యున్నత బాధ్యతలను నిర్వర్తించే అధికారాన్ని పొందుతానని తాను ఏనాడూ ఊహించలేదని రాంనాథ్ కోవింద్ అన్నారు. అయితే, మన దేశ ప్రజాస్వామ్య విధానం దీన్ని సుసాధ్యం చేసి చూపిందని జనవరిలో కాన్పూర్‌లో జరిగిన జన్ అభినందన్ సమారోహ్ సందర్భంగా చెప్పారు. ‘ఈ సందర్భంగా మన దేశ స్వాతంత్ర్య సమరయోధులకు, రాజ్యాంగ ముసాయిదా కమిటీకి రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వారి కారణంగానే సాధారణ కుర్రాడిని రాష్ట్రపతి కాగలిగాను. ఈ క్రెడిట్ అంతా ఈ మట్టిదే.. మీ అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులదే’ అని రాంనాథ్ కోవింద్ భావోద్వేగంతో చెప్పారు. ఈ మాతృభూమి ప్రేరణనే తనను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు నుంచి రాజ్యసభకు, అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు, తద్వారా రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లిందని ఆయన అన్నారు.
భార్య సవితాదేవితో కలిసి ప్రత్యేక అధ్యక్ష రైలులో న్యూఢిల్లీ నుంచి తన మాతృభూమికి వెళ్లి అక్కడి ప్రజలను కలుసుకోవాలని చాలా రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. అది ఇప్పుడు సాకారమైంది. కాన్పూర్‌కు ప్రత్యేక రైలులో చేరుకున్న కోవింద్, ఆయన భార్య.. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో తన స్వగ్రామానికి వచ్చారు. గత 15 ఏండ్లలో రాష్ట్రపతి తొలిసారి రైలు ప్రయాణం చేస్తుండటం విశేషం. రాష్ట్రపతిని గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లు ఘనంగా స్వాగతం పలికారు.
వ్యాక్సిన్ తీసుకున్న మహిళలో డెల్టా ప్లస్ వేరియంట్..!
లేహ్‌లో రక్షణ మంత్రి పర్యటన.. మాజీ సైనికులతో భేటీ
ప్రజా ఉద్యమంగా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి – వెంకయ్య నాయుడు
సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా
హాంగ్‌కాంగ్ యాపిల్ డెయిలీ మూసివేత
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..