న్యూఢిల్లీ, మే 28 : నీట్-యూజీ పేపర్ లీకై పరీక్ష రద్దు కావడంతో అభాసుపాలైన కేంద్రం ఈసారి అప్రమత్తమైంది. నీట్ పునః పరీక్ష విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా కఠిన చర్యలకు ప్రయత్నాలు ప్రారంభించింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రతి దశలోనూ పటిష్టమైన నిఘా, పూర్తి అప్రమత్తత పాటించాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) అధికారులు ఈ పరీక్ష జరిగే ప్రతి దశను పర్యవేక్షిస్తారు.
ప్రశ్న పత్రం రూపకల్పన, ప్రింటింగ్, రవాణా, ప్రశ్నపత్రాలు భద్రపర్చడం ఇలా ప్రతి దశ నుంచి పరీక్ష హాల్లో ఆఖరి విద్యార్థికి పేపర్ చేరే వరకు పటిష్ఠ నిఘా వ్యవస్థను ఉంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జూన్ 21న నిర్వహించబోతున్న నీట్ రీటెస్ట్ ప్రశ్నపత్రాలను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విమానాల్లో తరలించాలన్న ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు సమాచారం.