హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : రైళ్లలో మహిళా ప్రయాణికులకు ఎదురయ్యే రుతుస్రావం సమస్యను అధిగమించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రైల్వేస్టేషన్లలో ఉచిత శానిటరీ నాపిన్ ప్యాడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం అతిపెద్ద టెలికాం మౌలిక సదుపాయాల సంస్థ ఇండస్ టవర్స్‌తో రైల్వేశాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది.
తొలి విడతలో దేశవ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లల్లో 500 శానిటరీ నాపిన్ వెండింగ్ మెషీన్లను నెలకొల్పినట్లు పేర్కొంది. ఢిల్లీ, లక్నోతోపాటు కొన్ని డివిజన్లలోని 175 రైల్వే స్టేషన్లలో ఈ మెషీన్లను ఏర్పాటు చేశారు. ఈ శానిటరీ నాపిన్లు 24 గంటలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఇండస్ టవర్స్ నారీ సమ్మాన్ సీఎస్ఆర్ కార్యక్రమం కింద ఈ మెషీన్లను ప్రవేశపెట్టగా ఇప్పటివరకు 3 కోట్లకుపైగా నాపిన్లు పంపిణీ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. 2030 నాటికి మరిన్ని స్టేషన్లకు విస్తరిస్తామని తెలిపారు.