తెలంగాణలో జిల్లాలు ఆప్షన్ 1. 21, ఆప్షన్ 2. 23, ఆప్షన్ 3. 33. ఇది తెలంగాణలో జరుగుతున్న ఉద్యోగాల రిక్రూట్మెంట్లో అడిగిన ప్రశ్న అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వచ్చిన డౌట్ ఇది.
తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో కూడా తెలియని నిర్మలా సీతారామన్, మరోవైపు ఇక్కడ మెడికల్ కాలేజీలు ఎన్ని? అవీ ఎక్కడెక్కడ ఉన్నాయో సీఎం కేసీఆర్‌కు తెలియదా? అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కనీసం తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో నిర్మలా సీతారామన్‌కు తెలియకపోవడం మరీ విడ్డూరం. కేంద్ర బడ్జెట్‌పై జరిగిన కాన్క్లేవ్లో మెడికల్ కాలేజీల అంశాన్ని నిర్మలా సీతారామన్ ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయో తెలియదా? అని ప్రశ్నించారు. అయితే ఆ సందర్భంగా తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? అవీ 21?, 23?, 33? అని వేదికపై మంత్రి ప్రశ్నించారు. ఒకవైపు సీఎంను విమర్శిస్తూ….మరోవైపు జిల్లాలు ఎన్ని ఉన్నాయో కూడా మంత్రికి తెలియకపోవడం పట్ల సభికులు నోళ్లు వెళ్లబెట్టారు.
– వెల్జాల