FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఇ మ్యాచ్‌లో జర్మనీ అద్భుతమైన పునరాగమనంతో 2-1 తేడాతో ఐవరీ కోస్ట్‌పై విజయం సాధించి నాకౌట్ దశకు దూసుకెళ్లింది. కెనడాలోని టొరంటో స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ ప్రారంభం నుంచి జర్మనీ ఆధిక్యం కోసం ప్రయత్నించినప్పటికీ, ఐవరీ కోస్ట్ గట్టి పోటీనిచ్చింది. దీంతో 30వ నిమిషంలో ఐవరీ కోస్ట్ కెప్టెన్ ఫ్రాంక్ కేసీ అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఇక జర్మనీ చేసిన కొన్ని ప్రయత్నాలను ఐవరీ కోస్ట్ డిఫెన్స్ మరియు గోల్‌కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నారు.
అయితే రెండో సగంలో జర్మనీ కోచ్ జూలియన్ నాగెల్స్‌మన్ చేసిన మార్పులు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన డెనిజ్ ఉందావ్ జర్మనీకి రక్షకుడిగా నిలిచాడు. 68వ నిమిషంలో అమిరి అందించిన పాస్‌ను ఉందావ్ గోల్‌గా మలిచి స్కోరును 1-1తో సమం చేశాడు. మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనుకున్న తరుణంలో, ఇంజూరీ టైమ్‌లో 94వ నిమిషంలో ఉందావ్ మరో సంచలన గోల్ కొట్టి జర్మనీకి 2-1తో అపురూప విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో జర్మనీ లెజెండరీ గోల్‌కీపర్ మాన్యుయెల్ నూయర్ వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన గోల్‌కీపర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇది అతనికి 21వ వరల్డ్ కప్ మ్యాచ్. అలాగే డెనిజ్ ఉందావ్ 1990లో రోజర్ మిల్లా తర్వాత, ఒకే వరల్డ్ కప్‌లో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి ఐదు గోల్స్ భాగస్వామ్యాల్లో పాలుపంచుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ విజయంతో గ్రూప్-ఇలో జర్మనీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి 6 పాయింట్లతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.