Joe Root | ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో 14,000 టెస్టు పరుగుల మైలురాయిని అందుకుని చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో రెండో క్రికెటర్‌గా నిలిచిన రూట్, ఇప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు చేయడం ద్వారా రూట్ ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన రూట్, ఇప్పుడు అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2010లో సచిన్ ఈ రికార్డును నెలకొల్పగా, అది ఎప్పటికీ చెక్కుచెదరదని చాలా మంది భావించారు. ముఖ్యంగా ఆధునిక క్రికెట్లో టెస్టులకు ప్రాధాన్యం తగ్గుతున్న నేపథ్యంలో ఈ రికార్డు చాలా కాలం నిలిచిపోతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ మాత్రం టెస్టు క్రికెట్‌పై తనకున్న ప్రేమను, అంకితభావాన్ని మరోసారి నిరూపిస్తున్నాడు. నిలకడైన ప్రదర్శనలతో పరుగుల వరద పారిస్తున్న రూట్ ప్రస్తుతం 14,000 పరుగుల మార్క్‌ను దాటాడు. సచిన్ రికార్డును అధిగమించాలంటే అతనికి మరో 1,900కి పైగా పరుగులు అవసరం.
35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్న రూట్‌కు ఈ లక్ష్యం అసాధ్యం కాదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లండ్ తరచుగా టెస్టు సిరీస్‌లు ఆడుతుండటం కూడా అతడికి అనుకూలంగా మారే అవకాశం ఉంది.
15,921 – సచిన్ టెండూల్కర్ (భారత్)
14,000* – జో రూట్ (ఇంగ్లండ్)
13,378 – రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)
13,289 – జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)
13,288 – రాహుల్ ద్రవిడ్ (భారత్)
12,472 – అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్)
12,400 – కుమార సంగక్కార (శ్రీలంక)
11,953 – బ్రియాన్ లారా (వెస్టిండీస్)
11,867 – శివనారైన్ చంద్రపాల్ (వెస్టిండీస్)
11,814 – మహేల జయవర్ధనే (శ్రీలంక)
ఇక ఆధునిక క్రికెట్లో ఈ జాబితాలోకి ఎవరు చేరతారా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టెస్టు కెరీర్లో 9,230 పరుగులు సాధించగా, న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ 9,515 పరుగులతో కొనసాగుతున్నాడు. కాగా, జో రూట్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే సచిన్ టెండూల్కర్ చారిత్రక రికార్డు ఇప్పుడు నిజంగానే ప్రమాదంలో పడిందనే చర్చ క్రికెట్ ప్రపంచంలో మొదలైంది. మరి ఇంగ్లండ్ స్టార్ ఈ అరుదైన ఘనతను అందుకుంటాడా లేదా అనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారింది.