భారతదేశాన్ని గూగుల్ మ్యాప్‌లో చూస్తే మధ్యభాగంలో పచ్చబొట్టేసినట్టు కనిపిస్తుంది. జూమ్ చేస్తూ పోతే.. సాత్పురా పర్వత శ్రేణులు కనిపిస్తాయి. ఇంకాస్త జూమ్ చేస్తే.. మైకాల్ రేంజ్లో దట్టమైన అడవి కనిపిస్తుంది. కాకులు దూరని కారడవంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. చీమలు దూరని చిట్టడవిలో పులులు మాత్రం స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. అదే కన్హా అభయారణ్యం. సుమారు 1940 చదరపు కిలోమీటర్లు విస్తరించిన పులుల రాజ్యం ఇది.
ఇందులో 940 చ.కి.మీ మాత్రమే సందర్శనకు అనుమతి ఉంది. పులుల గాండ్రింపులు మాత్రమే వినిపించవండోయ్! నక్కల ఊలలు చెవిన పడతాయి, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తాయి, హరిణాల గుంపులు కంటపడతాయి, ఎదురులేకుండా తిరుగుతున్న ఎలుగుబంట్లూ తారసపడతాయి. అంతేనా హైనాలు.. మైనాలు, చిరుతలు.. చిలుకలు జీవవైవిధ్యం కళ్లముందుంటుంది. ఏడాదంతా ఈ అద్భుతాలను వీక్షించడానికి వీలుపడదు. అక్టోబర్ 16 నుంచి జూన్ 16 వరకు మాత్రమే కన్హా వనంలోకి విహారానికి అనుమతిస్తారు. మిగతా సమయంలో లోనికి ప్రవేశం ఉండదు.
సఫారీ: నాలుగు రకాల సఫారీలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో జీపు (ఆరుగురికి) రూ.8,000 నుంచి రూ.10,500 వరకు చార్జ్ చేస్తారు. ఐదేండ్లలోపు చిన్నారులకు ఉచితం. సూర్యోదయం నుంచి ఉదయం 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు సఫారీలు ఉంటాయి. పరిమిత ఏరియాలో నైట్ సఫారీ కూడా అందుబాటులో ఉంది.
ఎక్కడంటే..
కన్హా అభయారణ్యం జబల్పూర్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాగ్‌పూర్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్, వరంగల్ నుంచి జబల్పూర్కు రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్హా వనానికి చేరుకోవచ్చు.