కోల్కతా, నవంబర్ 25: పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ప్రభుత్వ దవాఖాన వైద్యులు ఒక అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. 12 ఏండ్ల బాలుడి ఊపిరితిత్తుల్లో 11 నెలలుగా చిక్కుకొని ఉన్న విజిల్ను బయటకు తీశారు. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్పూర్కి చెందిన రైహాన్ లస్కర్ అనే బాలుడు ఈ ఏడాది జనవరిలో చిప్స్ తింటూ పొరపాటున ఒక ప్లాస్టిక్ విజిల్ను కూడా మింగేశాడు. నోరు తెరిచినప్పుడల్లా ఈల శబ్ధం వచ్చేది. అదే సమయంలో గుండె ప్రాంతంలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు ఇన్ఫెక్షన్లు రావడం మొదలయ్యాయి. దీంతో వైద్యులను సంప్రదించగా.. ఆ బాలుడికి శస్త్రచికిత్స చేసి ఆ విజిల్ను బయటకు తీశారు.