కావలసిన పదార్థాలు
ఓట్స్: ఒక కప్పు, కందిపప్పు: పావు కప్పు, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, టమాట: ఒక్కొక్కటి చొప్పున, పచ్చిమిర్చి: నాలుగు, బీన్స్: ఐదు, పచ్చి బఠానీ: పావుకప్పు, కరివేపాకు, కొత్తిమీర: కొద్దిగా, ఇంగువ: చిటికెడు, పసుపు: అర టీస్పూన్, ఆవాలు, జీలకర్ర: ఒక టీస్పూన్, చింతపండు రసం: పావుకప్పు, బిసిబేళా బాత్ మసాలా: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత, నూనె: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ముందుగా కందిపప్పును ఉడకబెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేడయ్యాక ఓట్స్ వేసి రెండు నిమిషాలపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నూనెవేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి వేయించాలి. అన్నీ వేగాక చిన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికం, బీన్స్, టమాట, పచ్చి బఠానీలు వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, ఉడికించిన కందిపప్పు, చింతపండు రసం, బిసిబేళా బాత్ మసాలా వేసి బాగా కలిపి ఐదు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టాలి. కూరగాయలన్నీ బాగా ఉడికాక, ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ వేసి దగ్గర పడేవరకు ఉడికించుకుని కొత్తిమీర చల్లుకుంటే ఓట్స్ బిసిబేళా బాత్ రెడీ.