బెంగళూరు, జనవరి 19: కర్ణాటక పోలీస్ విభాగంలో అత్యున్నత స్థాయి (డీజీపీ ర్యాంక్) అధికారికి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనం రేపుతున్నది. డీజీపీ రామచంద్రారావు మహిళలతో అసభ్యంగా ప్రవరిస్తూ, పలువురి మహిళలతో సాగించిన రాసలీలల వీడియోలు కలకలం రేపుతున్నాయి. డీజీపీ ఆఫీస్‌లో యూనిఫాం ధరించి ఆయన ప్రవర్తించిన తీరు ఆ వీడియోల్లో స్పష్టంగా కనపడింది. ఈ ఉదంతం కర్ణాటక రాజకీయాల్లోనూ దుమారం రేపింది. ఈ వీడియోలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా ఈ వీడియోలపై డీజీపీ రామచంద్రారావు స్పందించారు. ఆ వీడియోల్లో ఉన్నది తాను కాదని, తనంటే గిట్టని వ్యక్తులు ఆ వీడియోను మార్ఫింగ్ చేసి ఆన్లైన్లో ఉంచారని ఆరోపించారు. ప్రస్తుతం ఆయన డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్కు డీజీపీగా ఉన్నారు. కాగా, ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన సినీ నటి రన్యా రావుకు సవతి తండ్రి. ఆయన పేరు చెప్పుకొని ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్‌లను తప్పించుకొని గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు రన్యా రావుపై ఆరోపణలు ఉన్నాయి.