హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సీట్లను ఎలా భర్తీ చేయాలన్న అంశంపై స్పష్టత కొరవడింది. భర్తీ విధానాన్ని ఇంతవరకు సర్కార్ వెల్లడించలేదు. బీబీఏ, బీసీఏ కోర్సులకు తమ నుంచి అనుమతి తీసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి రెండేండ్ల క్రితం స్పష్టంచేసింది. ఈ కోర్సులను డిగ్రీ కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఏఐసీటీఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని గ్రామీణ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు వ్యతిరేకించాయి. నిరుద్యోగ గ్రా డ్యుయేట్లు ఏర్పాటు చేసుకున్న కాలేజీలు ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందేందుకు అవస్థలు పడాల్సి ఉంటుందని వాదించాయి.
దీనిపై అప్పట్లో ఉన్నత విద్యామండలి, విద్యాశాఖలు ఏఐసీటీఈకి లేఖ రాశాయి. ఏఐసీటీఈ అనుమతుల నుంచి మూడేండ్లు మినహాయింపు ఇవ్వాలని ఆయా లేఖలో కోరాయి. దీనిపై ఏఐసీటీఈ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా, డిగ్రీ కాలేజీల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండేండ్లు గడిచిపోయాయి. 2026-27 విద్యాసంవత్సరంతో మూడో ఏడాది పూర్తవుతుంది. కానీ, కొన్ని ఇంజినీరింగ్ కాలేజీలు బీబీఏ, బీసీఏ కోర్సులు ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చాయి. ఏకంగా ఏఐసీటీఈ నుంచి అనుమతి పొందాయి. ఆయా కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వలేదు. ఈ అంశం ప్రస్తుతానికి పెండింగ్లోనే ఉంది.