హైదరాబాద్: తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. బ్లిట్జ్ విభాగంలో తన ఆరాధ్య ఆటగాడు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను వెనుకకు నెడుతూ అర్జున్ అగ్రస్థానాన్ని అధిరోహించాడు. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ఈ 18 ఏండ్ల వరంగల్ కుర్రాడు 2765 పాయింట్లతో భారత నంబర్‌వన్ ప్లేయర్‌గా నిలువడంతో పాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 13వ ర్యాంక్ దక్కించుకున్నాడు. నార్వే చెస్ స్టార్ మాగ్నస్ కార్ల్సన్(2892) ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.
బాకులో జరిగిన గషిమోవ్ స్మారక చెస్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో ఇప్పటి వరకు నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న ఆనంద్ రెండో ర్యాంక్‌కు పడిపోగా, అర్జున్ తన ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నాడు. స్పెయిన్‌లో ఈనెల 26 నుంచి జరిగే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీ కోసం వెళ్లిన అర్జున్ నంబర్‌వన్ ర్యాంక్‌పై సంతోషం వ్యక్తం చేశాడు. ఇటీవల కోల్‌కతా వేదికగా జరిగిన టాటా చెస్ టోర్నీలో ర్యాపిడ్ విభాగంలో విజేతగా నిలిచిన అర్జున్..బ్లిట్జ్ కేటగిరీలో రన్నరప్ కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలోతన కంటే మెరుగైన ప్లేయర్లను ఓడించి ఔరా అనిపించుకున్నాడు.