అల్వాల్, మే10 : క్యాసినో గేమ్‌కు బానిసై రూ.50 లక్షల అప్పుల పాలైన ఓ వ్యాపారి మనస్థాపంతో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మచ్చబొల్లారం డివిజన్ సాన్విప్రైడ్ హోమ్స్‌లో నివాసం ఉంటున్న తేరాల శ్రీనివాస్ (54) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో పౌల్ట్రీఫారం వ్యాపారం చేస్తున్నారు. గత 4 నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై శనివారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం కుమారుడు సూర్యతేజ ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.