MLC Naveen Kumar | శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలోని ఈదులకుంట చెరువు భూముల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు సత్యదూరం అని ఎమ్మెల్సీ కూర్మయ్యగారి నవీన్ కుమార్ తెలిపారు. ఆ భూముల వ్యవహారంతో నా సంస్థలకు, నా కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. వార్తల్లో ప్రసారమైన కె.నవీన్ కుమార్ అనే వ్యక్తిని నేను కాదు.. ఆయన ఎవరో నాకు తెలియదని అన్నారు.
నా పేరులోని సారూప్యతను ఆధారంగా చేసుకుని.. దాన్ని నాకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ మండిపడ్డారు. ఇది రాజకీయంగా నాపై బురదజల్లే ప్రయత్నంగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు నిర్ధారించకుండా, ఆధారాలు లేకుండా నన్ను వివాదంలోకి లాగడం తగదు అని సూచించారు. నాపై ఈదులకుంట వ్యవహారంలో ఆరోపణలు చేస్తున్నవారు.. వార్తలు ప్రసారం చేసిన సంబంధిత మీడియా సంస్థలు వెంటనే వాస్తవాలను పరిశీలించి కథనాలను సరిదిద్దాలని కోరారు.
నా ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు ప్రచారం కొనసాగిస్తే.. సంబంధిత వ్యక్తులు, మీడియా సంస్థలపై చట్టరీత్యా చర్యలకు వెనుకడనని హెచ్చరించారు. తనపై వస్తున్న అసత్యప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు కోరారు. వాస్తవాలను మాత్రమే విశ్వసించాలన్నారు.