ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కారనేది ఒకటే శాశ్వత సత్యం. ఏ పార్టీ అయినా ప్రజల అభిమానం ఉన్నంతవరకే అధికారంలో ఉంటుంది. పార్టీల మధ్య సంయమనం, సామరస్యం ఉండాలి. ప్రజలు, ప్రజల నిర్ణయమే అంతిమం అనేది ప్రతీ పార్టీ గుర్తుంచుకోవాలి. కానీ బీజేపీ ఈ రాజకీయ నీతిసూత్రాలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. విపక్షాలను వెంటాడి, వేధించి, తుదముట్టించే నిర్మూలన రాజకీయాలు చేస్తుండటం దురదృష్టకరం. బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై నడుపుతున్న కక్షపూరిత రాజకీయాలే ఇందుకు నిదర్శనం. మొన్నటిదాకా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ అన్నారు. ఇప్పుడు ‘తృణమూల్ కాంగ్రెస్ ముక్త్ బెంగాల్’ అనేది ఆచరణలో చేసి చూపుతున్నారు. ఒక పార్టీని ఓడించడం వేరు, భూస్థాపితం చేయాలనుకోవడం వేరు. పార్టీని చీలికలు, పీలికలు చేయడం, అసలు గుర్తే లేకుండా చేయడం, ఎక్కడికక్కడ భౌతికంగా అణచివేయాలని చూడటం ఇవేవీ ప్రజాస్వామ్యానికి శోభించే విషయాలు కాదు.
పార్టీ అంటే కేవలం ఒక పేరు కాదు, గుర్తు కాదు. అది ప్రజల విశ్వాసం, దశాబ్దాల రాజకీయ ప్రయాణం, కోట్లాది ఓటర్ల ఆశల సమాహారం. అలాంటి రాజకీయ పార్టీ గుర్తును ఒక ఎన్నికల ఆదేశంతో స్థగితం చేయడం అభిలషణీయం కాదు. దాదాపు 28 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, మూడుసార్లు ముఖ్యమంత్రిని అందించిన నాయకత్వం, కోట్లాది ఓటర్ల మద్దతు..ఇవన్నీ పక్కన పెట్టి, పార్టీ అసలైన పేరును, గుర్తును లేకుండా చేయడం ఏంది? పార్టీ అంతర్గత విభేదాలు కొత్త విషయం కావు. భారతీయ రాజకీయ చరిత్రలో ఎన్నో పార్టీల్లో విభేదాలు వచ్చాయి, కానీ వాటి పరిష్కారం ప్రజల తీర్పుతోనే జరిగింది. అయితే ఇక్కడ మా త్రం ఎన్నికల సంఘం జోక్యంతో కాగల కార్యం సాధిస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలకు అతీతంగా ఇదంతా కొనసాగుతున్నట్టు కనిపిస్తున్నది.
రెండు వర్గాలు పార్టీపై హక్కు కోరుతున్నాయనే కారణంతో, పార్టీ గుర్తును నిలిపివేయడమంటే అసలు ఆ పార్టీని నడిపిన ప్రజల సంకల్పాన్ని అడ్డుకోవడమే. ఓటర్లు తమ ఓటును ఒక గుర్తుకు, ఒక సిద్ధాంతానికి, ఒక నాయకత్వానికి ఇస్తారు. ఆ గుర్తును తొలగించడమంటే వారి రాజకీయ స్వేచ్ఛను దెబ్బతీయడమే. ఇప్పటికే పశ్చిమబెంగాల్ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో లక్షలాది మంది ఓటర్లను తొలగించిన అంశం వివాదాస్పదమైంది. ఇప్పుడు అదే ఎన్నికల సంఘం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన పేరు, గుర్తును నిలిపివేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. స్వతంత్రం గా, సంపూర్ణ నిష్పాక్షికతతో వ్యవహరించాల్సిన సంస్థ ఒక రాజకీయ అజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నదా? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం నియమాల వెనుక దాక్కోవడం కుదరదు. ప్రజల నమ్మకాన్ని కాపాడడం తప్పనిసరి. రాజకీయాలపై ఆధిపత్యా న్ని స్థిరపరుచుకోవడానికి బీజేపీ వేసే ఎత్తుగడలు రహస్యమేమీ కాదు. ప్రాంతీయ పార్టీలను వాడుకుని, అధికారం చేజిక్కించుకోవడం, తర్వాత ముక్కలు చెక్కలు చేయడం, ఏదో ఒక వర్గాన్ని కలిపేసుకోవడం వంటి అనైతిక అజెండాను బీజేపీ యథేచ్ఛగా అమలు చేస్తూనే ఉన్నది.
ఇప్పుడు బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ను లక్ష్యం గా చేసుకున్నది. ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నది. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అస్తిత్వాన్నే రూపుమాపే ఎత్తుగడలను అమలుచేస్తున్నది. ఇందుకు శివసేన ఉదాహరణ ఇప్పటికే ఉన్నది. బెంగాల్లో గత ఎన్నికల్లో బీజేపీకి 45 శాతం ఓట్లు వస్తే, టీఎంసీకి 40 శాతానికి పైగానే ఓట్లు వచ్చాయనేది గమనార్హం.
బీజేపీ తన ప్రస్థానం ఎక్కడ నుంచి మొదలైందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. అసలే సీట్లు లేని, ఆ తర్వాత కేవలం రెండు స్థా నాలకే పరిమితమైన స్థితిని చూసింది. తన విధానాలతో ఏమాత్రం ఏకాభిప్రాయం లేని ప్రత్యర్థి పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకుంటే ఏం జరిగేదో ఊహించుకోవాలి. మనది బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ. రాజకీయ ప్రత్యర్థులను రం గంలోనే లేకుండా చేయాలనే దుగ్ధ ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తుందని చెప్పక తప్పదు.