Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. కంటెస్టెంట్ల ఆటతీరుతో పాటు బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుని నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు మొదటి వారంలో చైత్ర ఎలిమినేట్ కాగా, రెండో వారంలో నటుడు కృష్ణుడు హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక మూడో వారంలో ముఖేష్ త్యాగం కారణంగా ఎలిమినేషన్ జరగలేదు. దీంతో పెండింగ్‌లో ఉన్న ఎలిమినేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. నాలుగో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం తొమ్మిది మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉన్నారు. ముఖేష్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఈ వారం ప్రేక్షకుల ఓట్లను ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓటింగ్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. త్రిగుణ్ భారీ మద్దతుతో మొదటి స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గత వారం కంటే ఈసారి ఆయనకు ఓటింగ్‌లో మరింత మద్దతు లభిస్తున్నట్లు ట్రెండ్స్ సూచిస్తున్నాయి.ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్ 13.17 శాతం ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. హౌస్‌లో తన ఆటతీరు, మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ముఖేష్ గౌడ కూడా ఓటింగ్‌లో క్రమంగా పుంజుకుంటున్నాడు.మొన్నటి వరకు ఐదో స్థానంలో ఉన్న ముఖేష్.. ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకున్నట్లు ట్రెండ్స్ చెబుతున్నాయి. వీరి తర్వాత చరణ్ నాలుగో స్థానంలో, అమన్ మసూద్ ఐదో స్థానంలో, షాలిని ఆరో స్థానంలో, దేబ్జానీ ఏడో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్ ఎనిమిదో స్థానంలో, సృష్టి తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం.
ఈ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే చరణ్, సృష్టి ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సృష్టి విషయంలో సోషల్ మీడియాలో చర్చ ఎక్కువగా జరుగుతోంది. రెండో వారంలోనే ఆమె ఎలిమినేషన్‌కు దగ్గరగా వెళ్లినప్పటికీ.. ఆ వారం కృష్ణుడు ప్రేక్షకుల ఓట్లతో హౌస్ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో హౌస్‌లో సుధీర్‌తో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో కొంత నెగెటివ్ స్పందన కనిపించింది. ఈ పరిణామాలు కూడా ఆమె ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.మరోవైపు చరణ్‌కు ఇప్పటికే ఒకసారి ఎలిమినేషన్ అనుభవం ఎదురైంది. మొదటి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా ఆయన హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. బిగ్ బాస్ మరోసారి అవకాశం కల్పించారు. అయితే ఆ అవకాశాన్ని చరణ్ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్స్‌ను బట్టి సృష్టి, చరణ్‌లు చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిగ్ బాస్ అధికారికంగా ఎలిమినేషన్ ప్రక్రియను ప్రకటించే వరకు ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది ఖచ్చితంగా చెప్పలేం.