Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో రోజుకో కొత్త ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వారం ఇప్పటికే మిథిలేష్ రూ.15 లక్షలు తీసుకుని హౌస్ నుంచి బయటకు వెళ్లడం సంచలనంగా మారగా.. తాజాగా ఎలిమినేషన్ విషయంలోనూ ఊహించని మలుపు చోటుచేసుకుంది. నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లలో చివరికి వర్షిణి, టెంపర్ వంశీ మాత్రమే మిగలడంతో వీరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ కెప్టెన్ ముఖేష్ తీసుకున్న నిర్ణయంతో ఇద్దరూ సేఫ్ అయ్యారు. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కంటెస్టెంట్లతో ఫన్ గేమ్స్ ఆడిస్తూ సందడి చేశారు. అదే సమయంలో హౌస్‌లోని పరిస్థితులను కూడా సమీక్షించారు. కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయాలు, వారి ఆటతీరు వంటి అంశాలపై చర్చ జరిగింది. జంతువులతో పోల్చుతూ ఇచ్చిన ట్యాగ్ల విషయంలోనూ హౌస్‌లో సరదా వాతావరణం కనిపించింది.
అయితే అసలు ట్విస్ట్ మాత్రం ఎలిమినేషన్ సమయంలో వచ్చింది. నామినేషన్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్లు ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ చివరికి వర్షిణి, వంశీ మాత్రమే మిగిలారు. దీంతో వీరిద్దరిలో ఒకరు హౌస్‌ను వీడాల్సి ఉంటుందని ప్రేక్షకులు భావించారు.అలాంటి సమయంలో నాగార్జున ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించారు. ప్రస్తుతం హౌస్ కెప్టెన్‌గా ఉన్న ముఖేష్ తన కెప్టెన్సీని, దానికి సంబంధించిన అధికారాలను వదులుకుంటే నామినేషన్స్ రద్దు చేసి ఇద్దరినీ సేఫ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. అంటే.. ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేస్తే వర్షిణి, వంశీ ఇద్దరూ ఎలిమినేషన్ నుంచి బయటపడతారన్నమాట.ఈ ఆఫర్‌పై ముఖేష్ పెద్దగా ఆలోచించలేదు. తన కెప్టెన్సీని వదులుకోవడానికి అంగీకరించి వర్షిణి, వంశీ ఇద్దరినీ కాపాడాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ అనూహ్యంగా ముగిసింది. ఒకవైపు ఇద్దరు కంటెస్టెంట్లు సేవ్ కాగా.. మరోవైపు ముఖేష్ మాత్రం తన కెప్టెన్సీని కోల్పోవాల్సి వచ్చింది.
ముఖేష్ నిర్ణయం హౌస్‌లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. తనకు వచ్చిన కెప్టెన్ పవర్‌ను ఉపయోగించుకోవడం కంటే ఇద్దరు కంటెస్టెంట్లను కాపాడటానికే అతను ప్రాధాన్యత ఇచ్చాడు. ఒకవేళ ముఖేష్ ఈ ఆఫర్‌ను తిరస్కరించి ఉంటే వర్షిణి, వంశీలో ఒకరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండేది. ముఖ్యంగా వంశీ ఎలిమినేషన్‌కు దగ్గరగా ఉన్నాడనే చర్చ కూడా సాగింది. ఇక ఇదే సమయంలో మిథిలేష్ రూ.15 లక్షలు తీసుకుని బయటకు వెళ్లిన వ్యవహారం కూడా హౌస్‌లో మరో వివాదానికి కారణమైంది. కేవలం కొద్ది రోజులు మాత్రమే హౌస్‌లో ఉన్న మిథిలేష్ భారీ మొత్తాన్ని తీసుకుని వెళ్లిపోవడంతో కొంతమంది కంటెస్టెంట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై త్రిగుణ్ తీవ్రంగా స్పందించడంతో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. అమన్‌తో వాగ్వాదం కూడా చోటుచేసుకుంది.
మరోవైపు రోహిత్‌కు నాగార్జున చెప్పిన శుభవార్తతో వీకెండ్ ఎపిసోడ్ భావోద్వేగంగా కూడా మారింది. రోహిత్ సోదరికి బాబు పుట్టిన విషయాన్ని నాగార్జున ప్రకటించడంతో రోహిత్ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు 10లో ఈ వారం ఎలిమినేషన్ కంటే ట్విస్ట్లే ఎక్కువగా కనిపించాయి. మిథిలేష్ డబ్బులు తీసుకుని వెళ్లిపోవడం, ఆ తర్వాత ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేసి ఇద్దరినీ సేవ్ చేయడం హౌస్ గేమ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇక వచ్చే వారం నుంచి కెప్టెన్సీ లేకుండా ముఖేష్ ఆట ఎలా సాగుతుంది? కొత్త కెప్టెన్ ఎవరు అవుతారు? నామినేషన్స్, టాస్క్‌లు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి? అనేది ఆసక్తికరంగా మారింది.