ఈ రోజు అమరవీరుల దినం. 1931 లో సరిగ్గా ఇదే రోజున భగత్ సింగ్, శివరాం రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్లను ఉరితీశారు. ముందుగా ముగ్గురిని ఉరి తీసే తేదీగా కోర్టు మార్చి 24 ను నిర్ణయించినప్పటికీ.. పరిస్థితులు క్షీణిస్తాయని బ్రిటిష్ ప్రభుత్వం భయపడి ఒక రోజు ముందే లాహోర్ సెంట్రల్ జైలులో ఉరితీసింది. ఉరితీయడానికి ముందు చివరికోరికగా సంకెళ్లు తీసిన అనంతరం వారు ‘ఇంక్వెలాబ్ జిందాబాద్.. వందేమాతరం..’ అంటూ నినాదాలు చేశారు. ఈ ముగ్గురూ ఆంగ్ల అధికారి సాండర్స్‌ను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.
1907 సెప్టెంబర్ 28 న పంజాబ్ లైల్పూర్లోని బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్.. జల్లియన్‌వాలా బాగ్ ఉదంతం జరిగినప్పుడు 12 ఏండ్ల పిల్లవాడు. ఈ ఊచకోతను చూసిన అతడికి బ్రిటిష్ వారిపై కోపం పెరిగింది. కకోరి సంఘటన తర్వాత విప్లవకారులను ఉరి తీయడం వల్ల భగత్‌సింగ్ కోపం మరింత పెరిగింది.
ఆ తర్వాత హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ఆఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌లో చేరారు. 1928 లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా బ్రిటిష్ సైన్యం లాఠీచార్జీ జరిపారు. ఈ లాఠీచార్జ్‌లో లాలా లాజ్‌పత్ రాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ గాయాలు అతని మరణానికి దారితీశాయి.
దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి విప్లవకారులు పోలీసు సూపరింటెండెంట్ స్కాట్‌ను హత్య చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. 1928 డిసెంబర్ 17 న, స్కాట్‌కు బదులుగా వచ్చిన స్కాట్ సాండర్స్ అనే ఆంగ్ల అధికారిపై దాడి చేయగా.. అతను మరణించాడు. 1929 ఏప్రిల్ 8 న భగత్ సింగ్. బటుకేశ్వర్ దత్.. బ్రిటిష్ ఇండియా సెంట్రల్ అసెంబ్లీ వద్ద బాంబులను విసిరారు. ఈ బాంబులను ఉద్దేశపూర్వకంగా ఆడిటోరియం మధ్యలో విసిరారు.
బాంబు విసిరిన తరువాత పారిపోకుండా అక్కడే నిలబడి ఉండి పోలీసులకు లొంగిపోయాడు. దాదాపు రెండేండ్ల జైలు జీవితం గడిపిన భగత్ సింగ్‌ను 90 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదేరోజున రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి ఉరితీశారు. అదే సమయంలో బటుకేశ్వర్ దత్‌కు జీవిత ఖైదు శిక్ష విధించారు.
2011: హాలీవుడ్ నటి ఎలిజబెత్ టేలర్ కన్నుమూత
2001: 15 సంవత్సరాల సేవ తర్వాత పనిచేయడం మానేసిన రష్యన్ అంతరిక్ష కేంద్రం మీర్
1998: 11 ఆస్కార్ అవార్డులను అందుకొని కొత్త రికార్డు నెలకొల్పిన జేమ్స్ కామెరాన్ నిర్మించిన హాలీవుడ్ చిత్రం టైటానిక్
1976: కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ జననం
1956: ప్రపంచంలో మొట్టమొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా అవతరించిన పాకిస్తాన్
1953: బయో-ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా జననం
1940: లాహోర్ సమావేశంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశాన్ని సృష్టించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ముస్లిం లీగ్
1910: సోషలిస్టు నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జననం
1910: ప్రముఖ జపాన్ చిత్ర దర్శకుడు అకిరా కురోసావా జననం
1903: విమానం పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న రైట్ బ్రదర్స్
1857: న్యూయార్క్‌లోని డిపార్ట్మెంట్ స్టోర్‌లో మొదటిసారిగా కమర్షియల్ ఎలివేటర్ ఏర్పాటు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.