Hottest AI Jobs| మనిషి సృష్టించిన ఏఐ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. ఏం చేయాలన్నా ఏఐ ఉందిగా అని ప్రతి నోట వింటున్న మాట. దినదినాభివృద్ధి చెందుతున్న ఏఐ (Artificial Intelligence) అందరి దిశ మారుస్తుంది. విద్యార్థుల చూపు కూడా ఏఐ చదువులపై పడుతుంది. 2026 నాటికి ఐటీ రంగంలో సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఐటీ నిపుణులు తమ కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడే అత్యుత్తమ ఏఐ కోర్సుల గురించి తెలుసుకుందాం..
ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ (FDE-Forward Deployed Engineer)
2026లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ కెరీర్లో ఫార్వర్డ్ డిప్లాయ్డ్ ఇంజినీర్ (FDE) ఒకటి. ఇది సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌లో ప్రత్యేకమైనది. వీరు సాధారణ సాఫ్ట్వేర్ ఇంజినీర్లలా కాకుండా నేరుగా కస్టమర్ లేదా క్లయింట్ ఆఫీసుల్లో ఉండి వారి వ్యాపార సమస్యలను అర్థం చేసుకుని అక్కడికక్కడే కోడింగ్ చేసి, టెక్నాలజీ సొల్యూషన్స్ అమలు చేస్తారు. ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, పలంటిర్, డేటాబ్రిక్స్, సర్వం ఏఐ, టీసీఎస్ వంటి సంస్థలు తమ ఏఐ నెట్‌వర్క్‌లను విస్తురిస్తున్నాయి. దీంతో ఈ FDEలకు డిమాండ్ పెరిగింది. ఎఫ్‌డీఈ నిపుణులు సంస్థల ఉత్పత్తుల కోసం ఏఐ సిస్టమ్‌లను రూపొందించడానికి సహాయపడతారు. వ్యాపార ప్రక్రియల్లో ఏఐని అనుసంధానించడం, టెక్నికల్ సమస్యలను పరిష్కరించడం, వ్యాపార విలువలను కచ్చితంగా అంచనా వేయడం వంటివి వీరి ప్రత్యేకత.
స్కేలర్ (Scaler) సంస్థ ఎఫ్‌డీఈ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. దీనిలో ఏఐ/ఎల్ఎల్ఎమ్ ఇంజినీరింగ్, బ్యాకెండ్ అండ్ ఫుల్‌స్టాక్ డెవలప్మెంట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్ డిజైన్, సెక్యూరిటీ వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.
RAG అండ్ ఏజెంటిక్ ఏఐ లీడ్ (RAG and Agentic AI Lead)
RAG (Retrieval-Augmented Generation), ఏఐ లీడ్ అనేవి ఏఐలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన అధునాతన భావనలు. ఇవి ఏఐ మోడల్స్ ఆలోచించే, సమాధానం ఇచ్చే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. RAG అనేది ఏఐ మోడల్స్‌కు తమ సొంత డేటా కాకుండా బయట ఉండే నిర్దిష్ట సమాచారం (కంపెనీ డాక్యుమెంట్లు, పీడీఎఫ్‌లు, వెబ్ డేటా) నుంచి సమాధానాలు వెతికి చెప్పే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఏజెంటిక్ ఏఐ అనేది కేవలం ప్రశ్నలకు సమాధానం చెప్పే బాట్ కాకుండా స్వతంత్రంగా పనులను ప్లాన్ చేసుకుని, సాధన చేసి, పూర్తి చేయగల ఒక స్మార్ట్ ఏజెంట్. RAG, ఏజెంటిక్ ఏఐ కలిసి పనిచేసినప్పుడు ఏఐ ఒక అడుగు ముందుకు వేస్తుంది. కంపెనీలు కేవలం సాధారణ ఏఐ మోడల్స్‌పై ఆధారపడకుండా తమ సొంత డేటాను విశ్లేషించే టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దీంతో RAG అండ్ ఏజెంటిక్ ఏఐ లీడ్ నిపుణులకు డిమాండ్ పెరిగింది.
బోస్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనలిటిక్స్ (BIA).. లాంగ్ చైన్, ఆటోజెన్, క్య్రూ ఏఐ, లాంగ్ గ్రాఫ్ వంటి అధునాతన ఫ్రేమ్‌వర్క్‌తో కూడిన 200 గంటలకు పైన జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది.
ఏఐ ఎవాల్యూషన్ ఇంజినీర్ (AI Evaluation Engineer)
ఇది ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) సామర్థ్యం, కచ్చితత్వం, భాషా నైపుణ్యాన్ని పరిశీలించి మెరుగుపరిచే ఒక కీలకమైన ఉద్యోగం. ఏఐ మోడల్‌ను తయారు చేయడం ఒక ఎత్తు అయితే, అది ఎంతవరకు కచ్చితత్వంతో పనిచేస్తుందో పరీక్షించడం మరొక ఎత్తు. ఏఐ వ్యవస్థలు నమ్మదగినవిగా, సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధారించడానికి ఈ నిపుణులు అవసరం. వీరు సరికొత్త టెస్టింగ్ ఫ్రేమ్‌వర్క్‌లను సృష్టించి ఏఐ సిస్టమ్‌ల నాణ్యతను నిరంతరం పరీక్షిస్తారు. తప్పులను గుర్తించి ప్రొడక్షన్ దశలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తారు.
కోర్సెరా (Coursera) వేదికగా ఐబీఎమ్ అందిస్తున్న RAG అండ్ ఏజెంటిక్ ఏఐ లీడ్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులో ఏఐ ఎవాల్యుయేషన్, డిప్లాయ్‌మెంట్ అంశాలపై ప్రత్యేక మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి.
కాంటెక్స్ట్ ఇంజినీర్ (Context Engineer)
ఇప్పటివరకు ప్రాంప్ట్ ఇంజినీరింగ్ గురించి విన్నాం. కానీ అంతకు మించి కాంటెక్స్ట్ ఇంజినీరింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఏఐ, ఎల్ఎల్ఎమ్లో సరైన సమాచారాన్ని, సరైన సమయంలో, సరైన పద్ధతిలో అందించే ప్రక్రియనే కాంటెక్స్ట్ ఇంజినీరింగ్ అంటారు. కార్పొరేట్ సంస్థల్లో ఏఐ మోడల్‌తో సమానంగా కాంటెక్స్ట్కు ప్రాధాన్యం ఉంటుంది.
ఐఐటీ మద్రాస్ ప్రవర్తక్-ఎమెరిటస్ భాగస్వామ్యంతో అందిస్తున్న ఏజెంటిక్ ఏఐ అప్లికేషన్స్ ప్రోగ్రామ్‌లో కాంటెక్స్ట్ ఇంజినీరింగ్‌ను ప్రత్యేక సిలబస్‌గా చేర్చారు.
సీనియర్ లీడ్ క్వాలిటీ ఇంజినీర్ – ఏఐ సిస్టమ్స్ (Senior Lead Quality Engineer – AI Systems)
సాధారణ సాఫ్ట్వేర్ క్వాలిటీ అస్యూరెన్స్ కేవలం బగ్స్‌ను గుర్తించడానికే పరిమితమవుతుంది. కానీ ఏఐ క్వాలిటీ ఇంజినీరింగ్ పరిధి చాలా పెద్దది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎమ్ఎల్) ద్వారా నడిచే సాఫ్ట్వేర్ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించే కీలకమైప పాత్ర. ఈ ఇంజినీర్లు ఏఐ సిస్టమ్స్ కచ్చితత్వం, సురక్షితత, పనితీరును వివిధ పద్ధతుల ద్వారా పరీక్షిస్తారు.
ట్రిపుల్ ఐటీ బెంగళూరు అందిస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ద్వారా అభ్యర్థులు లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ ఎవాల్యుయేషన్లలో నైపుణ్యం సాధించవచ్చు.
ఏఐ రెడ్ టీమ్ ఇంజినీర్ (AI Red Team Engineer)
ఇది ఒక అధునాతన సైబర్ సెక్యూరిటీ భద్రత. ఏఐ వాడకం పెరిగే కొద్దీ సైబర్ భద్రతా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ సిస్టమ్‌లను హ్యాకర్ల బారిన పడకుండా కాపాడటమే వీరి విధి. హ్యాకర్లు ఆలోచించే విధంగా ఆలోచించి ఏఐ, ఎల్ఎల్ఎమ్లోని లొసుగులను కనిపెట్టడం వీరి బాధ్యత.
ఇన్ఫోసెక్ ట్రైన్ అందిస్తున్న సర్టిఫైడ్ ఏఐ గవర్నెన్స్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్‌లో ఏఐ రెడ్ టీమింగ్, యూరోపియన్ యూనియన్ (EU) ఏఐ చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
ఏఐ ఎథిక్స్ స్పెషలిస్ట్ (AI Ethics Specialist)
అనేక ఏఐ టెక్నాలజీని నైతికంగా, పక్షపాతం లేకుండా, సురక్షితంగా అభివృద్ధి చేయడానికి పనిచేయడమే ఈ నిపుణుల పాత్ర. నియామకాలు, ఆరోగ్యం, ఫైనాన్స్, విద్య, ప్రభుత్వ సేవల్లో ఏఐ వాడకం పెరగడంతో అవి పారదర్శకంగా, నిష్పాక్షికంగా, నైతికంగా పనిచేసేలా చూడటం అత్యంత కీలకం.
పీర్సన్ వియూ (Pearson VUE) పరీక్ష కేంద్రాల ద్వారా దేశంలో అందుబాటులో ఉన్న గార్ప్ రిస్క్ అండ్ ఏఐ (GARP RAI) సర్టిఫికేషన్ ఈ రంగానికి సంబంధించి అత్యంత గుర్తిపు పొందిన కోర్సు.
ఏఐ సాంకేతికత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులు కేవలం సంప్రదాయ కోడింగ్‌కు పరిమితం కాకుండా పై కోర్సుల్లో నైపుణ్యాలు పెంచుకుంటే ఐటీ రంగంలో తిరుగులేని అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. రూ. లక్షల్లో జీతం పొందవచ్చు.