హైదరాబాద్, మే 2: వాహన రుణాలు తీసుకునేవారికి శుభవార్తను అందించింది బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ). వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నది. దీంతో వాహన రుణాలపై వడ్డీరేటు 7.25 శాతం నుంచి 7 శాతానికి దిగొచ్చింది. అలాగే ప్రాసెసింగ్ చార్జీలను రూ.1,500 తగ్గించింది. దీనికి జీఎస్టీ అదనం. ఈ ప్రత్యేక తగ్గింపు జూన్ 30 వరకు అమలులో ఉండనున్నదని పేర్కొంది. రుణ గ్రహీతల క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా ఆ తగ్గింపు వడ్డీరేటు వర్తించనున్నదని తెలిపింది. కానీ, గతంలో తీసుకున్న కార్లు, ద్విచక్ర వాహన రుణాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఇప్పటికే బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేటును 6.50 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.