హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోయే 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తెలుగు మహాసభలకు హాజరుకావాల్సిందిగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వా నం అందింది. ఆటా ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించింది. ఈ సందర్భంగా ఆటా మహాసభల పోస్టర్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ ఏడాది జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆటా తెలుగు మహాసభలను నిర్వహించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఆటా బృందం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. మూడు రోజులపాటు జరిగే ఈ సభల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వైవిధ్యభరితమైన కార్యక్రమాలను రూపొందించినట్టు కేటీఆర్‌కు ప్రతినిధులు వివరించారు..
ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో కేటీఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల (ఎన్నారై) ప్రస్తుత పరిస్థితులు, అకడ మారుతున్న రాజకీయ సమీకరణాలు, తెలుగు సమాజానికి అందుతున్న అవకాశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల పాత్రను కేటీఆర్ అభినందించారు. కేటీఆర్‌ను కలిసినవారిలో ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమలరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి బండా తదితరులున్నారు.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టీడీఎఫ్) ప్రతినిధులు హైదరాబాద్‌లో శుక్రవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర, అప్పటి టీడీఎఫ్ చైర్మన్ మధురెడ్డి నల్లగొండ ఫ్లోరైడ్ పోరాటంలో మద్దతు ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైలు ప్రజలకు అమెరికాలో ఉండి కూడా ఎలా మద్దతు కూడగట్టారో వివరించారు. శరత్ వేములతో రెండు దశాబ్దాలుగా తనకు ఉన్న ఉద్యమ సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు.