e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News తెలంగాణను చూసి నేర్చుకోవాలి

తెలంగాణను చూసి నేర్చుకోవాలి

  • గడ్డి పెడుతున్న ఏపీ ప్రజలు
  • అక్కడి నాయకత్వంపై చురకలు
  • సమైక్యవాదుల అనైక్య కీచులాటలు
  • ఏవగింపు తెస్తున్న ఏపీ రాజకీయాలు
  • తెలంగాణే బెటరంటున్న ఆంధ్రా జనం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (నమస్తే తెలంగాణ): టీడీపీ మాటలతో చూపిస్తే.. వైసీపీ చేతలతో చూపిస్తున్నది. దాడులతో, ప్రతిదాడులతో ఏపీ రాజకీయ రణరంగమవుతున్నది. సమైక్య రాగాలు తీసినవాళ్లు తమలో తామే కీచులాడుకుంటున్నారు. అరెస్టులు, ధర్నాలతో అట్టుడుకుతున్న ఏపీపై అక్కడి ప్రజలే ముక్కు విరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారమే అన్నవాళ్లు అరాచకంలో మునిగిపోతున్నారు. విడిపోతే తెలంగాణ పడిపోతుందని అన్నవాళ్లు కలబడి కత్తులు దూసుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఏపీలోని డ్రామాలు, పొలిటికల్‌ ట్రిక్కులు. తిట్ల దండకాలు.. రోడ్లమీదికెక్కడాలు చూసి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే ఏవగించుకుంటున్నారు. తమ నేతల తీరు చూసి ఇదేం సంస్కారమని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు మన నుంచి విడిపోయిన తెలంగాణ ఎంత గొప్పగా ఉన్నదో అని ఒకరు గుర్తు చేసుకుంటే.. అభివృద్ధిని పట్టాలపై పరుగులు పెట్టించిన తెలంగాణ ఎక్కడ? అవహేళనలతో రోడ్డెక్కుతున్న ఏపీ రాజకీయాలెక్కడ? అని మరికొందరు సామాజిక మాధ్యమాల్లో చర్చించుకుంటున్నారు. కొందరు ఏపీ నేతలు హద్దులుదాటి మాట్లాడడాన్ని అక్కడి ప్రజలే అసహ్యించుకుంటున్నారు. గత రెండు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూసి నాయకులకు ఇది భావ్యంకాదని, పక్కనున్న తెలంగాణను చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పరిపాలించడం రాదని వేలెత్తిచూపిన ఏపీలో పరిపాలనను, ప్రజా సమస్యలను గాలికొదిలేసి రాసులాడుకోవడం అవసరమా? అని అక్కడివారంటున్నారు.

అందరి మాట.. తెలంగాణ బెస్ట్‌

‘దళితబంధు పథకం తానే ప్రకటించి ఆ క్రెడిట్‌ను తానే కొట్టేయవచ్చు. కానీ సీఎం కేసీఆర్‌ అలా చేయలేదు. అందరినీ విశ్వాసంలోకి తీసుకుని, ప్రతిపక్ష పార్టీలను పిలిచి, పథకం గురించి వివరించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం అఖిలపక్ష సమావేశానికి హాజరై విజ్ఞత ప్రదర్శించారు. ఇలాంటి రాజకీయాలు శ్రేయస్కరం. కానీ దిగజారడం, మంచిదికాదు. రాజకీయాల్లో భాష ముఖ్యం. రాజకీయ నేతలు మాట్లాడే భాష మరీ ముఖ్యం’ అని నెల్లూరుకు చెందిన మునీర్‌ అహ్మద్‌ షేక్‌ అభిప్రాయపడ్డారు.

  • తెలంగాణ ప్రజలకు పాలించడం రాదు.. తమని తాము పరిపాలించుకోలేరు అన్నవి బీరాలే. ఇన్నాళ్లు తెలంగాణలో కలిసుండి అక్కడి రాజకీయాలను మనమే చెడగొట్టామా.. అన్న అనుమానం కలుగుతోంది’ అని జంగారెడ్డిగూడేనికి చెందిన మస్తాన్‌వలీ చెప్పారు. ఎలాంటి గొడవలు లేకుండా తెలంగాణ స్వచ్ఛంగా కనిపిస్తున్నదన్నారు.
  • ‘తెలంగాణలో పరిపాలన, అభివృద్ది, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే ముచ్చేటేస్తున్నది. నిర్మాణాత్మక చర్చలు, ప్రతిపక్షాలు తప్పులు ఎత్తిచూపడం. ప్రభుత్వం సమాధానాలివ్వడం, విమర్శలను తిప్పికొట్టడం చూస్తే అసెంబ్లీ సమావేశాలంటే ఇలాగే ఉండాలి అనిపిస్తున్నది. అక్బరుద్దీన్‌ ఓవైసీ ‘హమ్‌ ప్యారేసే లడేంగే’ అనడం తెలంగాణలోని రాజనీతిజ్ఞతకు తార్కాణంగా నిలుస్తున్నది’ అని కడపకు చెందిన పెంచలయ్య అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీల్లోని కొందరు దుందుడుకు నేతలు తప్ప.. మిగతా సీనియర్లంతా సద్విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల పరిపక్వతకు నిదర్శనమని ఆయన అన్నారు.
  • ‘ఒకపక్క రాష్ట్రం విడిపోయి రాజధాని లేక భవిష్యత్తు ఏమి టో తెలియని పరిస్థితుల్లో ఏపీ ప్రజలుండగా, ఇలాంటి గొడవలు పడటం సమంజసంకాదు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు అండగా ఉండాల్సిన టైంలో బయటికిరాని నేతలు రాజకీయ విమర్శలు, దూషణలతో వీధికెక్కుతున్నారు’ అని వెంకట్రావు తెంపల్లి అక్కడి నేతల తీరుపై అగ్రహించారు.
  • ‘తెలంగాణలో బడుగుల జీవితాలు బాగుపరుస్తూ, రాజకీయాలకు అర్థం చెబుతూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శ్రమిస్తున్న కేసీఆర్‌ లాంటి పరిపాలనాదక్షుడు మాకు సీఎం అయితే బాగుండేది. ఇలాంటి వ్యక్తిలేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది’ అంటూ వీరవాసరానికి చెందిన సూర్యనారాయణ తెలంగాణను ఆకాశానికెత్తారు.

ఏపీలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

- Advertisement -

పట్టాభి అరెస్టు, నారా లోకేశ్‌పై కేసు
నేడు దీక్షకు దిగనున్న చంద్రబాబు

అమరావతి: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఉద్రిక్తతలు బుధవారం వరుసగా రెండోరోజూ కొనసాగాయి. టీడీపీ కార్యాలయాలపై దాడిని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. మంగళవారం నాటి దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను అంబులెన్సులో పార్టీ కార్యాలయానికి తరలిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నేత లోకేశ్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా 36 గంటల దీక్ష చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో.. ధ్వంసమైన సామాగ్రి మధ్య దీక్ష చేపట్టనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. శనివారం ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఆయన ఫిర్యాదు చేస్తారని వివరించాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement