హైదరాబాద్, మార్చి 9, (నమస్తే తెలంగాణ): ఒకేసారి 91,142 ఉద్యోగాల భర్తీ ప్రకటన.. దేశంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు.. ఏ శాఖ చేపట్టలేదు, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించలేదు. ఇది తెలంగాణకే సాధ్యమైన రికార్డు. దేశ చరిత్రలోనే ప్రథమం. అవును! ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఉద్యోగాల ప్రకటన చరిత్రలో రికార్డుగా మిగిలిపోతుంది. జాతీయ స్థాయిలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, వివిధ రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కానీ ఇంత పెద్ద మొత్తంలో ఒక్క ఏడాదిలోకానీ, ఒకేసారిగానీ ఉద్యోగ నియామకాలను చేపట్టిన దాఖలాల్లేవు. దేశం మొత్తానికి కలిపి నియామకాలు చేపట్టే యూపీఎస్సీ కూడా ఇప్పటివరకు 5 వేలకు మించి నియామకాలు జరిపిన సందర్భాలు లేవు. మిలిటరీ, ఎయిర్ఫోర్స్, నేవీ, రైల్వేకు చెందిన నియామక బోర్డులు కూడా ఒకే సారి 91,142 నియామకాల ప్రకటన చేయలేదని ఉద్యోగ నియామకాలకు శిక్షణ ఇచ్చే సంస్థలు చెప్తున్నాయి.