అనస్వర రాజన్ మలయాళంలో బిజీ హీరోయిన్. ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకూ ఆమె చేరువైంది. దాంతో నిదానంగా టాలీవుడ్లోనూ అనస్వరకు అవకాశాలు వరిస్తున్నాయి. తెలుగులో ఆమె కథానాయికగా నటించిన ‘ఇట్లు అర్జున’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. మెగాస్టార్ ‘కాకా’ సినిమాలోనూ అనస్వర కీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే.
ఈ క్రమంలోనే ఈ మలయాళ మందారాన్ని మరో గోల్డెన్ ఛాన్స్ వరించింది. ఆ వివరాల్లోకెళ్తే.. రవితేజ – వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలోనే అనస్వర నటించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే.. అందులో తను పోషించేది హీరోయిన్ పాత్రా? లేక ప్రత్యేక పాత్రా? అనే విషయంపై క్లారిటీ లేదు.
తాజాగా ఈ సినిమాకు చెందిన ఫొటో షూట్లో అనస్వర రాజన్ పాల్గొన్నారట. హారర్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానం ఉన్నదట. ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఈ ఫొటోషూట్లో పాల్గొన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివున్నది. ఈ సినిమాకు ‘తులాభారం’ అనే పేరును పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి.