‘రికార్డుల గురించి నేను, సుకుమార్ ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమాను ప్రేక్షకులు ఏ స్థాయిలో నిలబెడతారు? ఎంత వసూళ్లు చేస్తుందనే లెక్కలు మేము ఏరోజు వేసుకోలేదు. హిట్ సినిమా చేయాలనే సంకల్పంతో కష్టపడ్డాం. ప్రేక్షకులు మాకు ఏది ఇచ్చిన బోనస్‌గానే భావిస్తాం’ అని అన్నారు అల్లు అర్జున్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో అల్లు అర్జున్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘పుష్ప’ సినిమాతో మీ ప్రయాణం ఎలా సాగింది?
గత రెండేళ్లుగా ఈ సినిమాతో ప్రయాణం సాగిస్తున్నా. లాక్డౌన్ సమయంలో కూడా దర్శకుడు సుకుమార్‌తో పాటు ఇతర టెక్నీషియన్స్‌తో వీడియో కాల్స్ ద్వారా సంభాషిస్తూ సినిమా గురించి చర్చించేవాడిని. సినిమా ఆరంభమైనప్పటికి నుంచి ఇప్పటివరకు మా టీమ్ అంతా నిరంతరం ఈ సినిమా ధ్యాసలోనే ఉన్నాం.
‘పుష్ప’ చిత్రీకరణలో చాలా కష్టంగా అనిపించిన అంశాలేమిటి?
మారేడుమిల్లి అభయారణ్యంలో చిత్రీకరణ చేయడం కష్టంగా అనిపించింది. కొన్ని గ్రామాల మధ్య సరైన రోడ్డు లేకపోవడంతో లొకేషన్‌కు చేరడంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. రోడ్లు, వంతెనలు ఉన్నా కూడా వర్షాకాలంలో కొట్టుకుపోవడంతో ప్రయాణం చాలా కష్టంగా అనిపించేది. దాదాపు రెండుమూడు వందల కార్లు, లారీలతో షూటింగ్ చేశాం. వాటిని అక్కడకు చేరవేయడం అంత సులభం కాదు. ఎన్నో ప్రతికూలతల నడుమ కూడా యూనిట్ వాళ్ల సహకారంతో షూటింగ్ సజావుగా సాగిపోయింది.
అడవిలో షూటింగ్ చేశారు కదా…ఆ అనుభవాల గురించి?
ప్రతిరోజు ఓ సరికొత్త అనుభవంలా అనిపించింది. అడవి తాలూకు వాతావరణం ఎక్సైట్ చేసింది. ఎన్నో అందమైన అనుభూతుల్ని మిగిల్చింది. అన్నింటికంటే ముఖ్యంగా మన దగ్గర ఇలాంటి ప్రాకృతిక సౌందర్యంతో అలరారే అరణ్యం ఉందా అని అందరం ఆశ్చర్యపోయాం.
స్మగ్లర్‌గా మీ పాత్ర పోషణ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకున్నారు. ఏమైనా రీసెర్చ్ చేశారా?
సుకుమార్ టీమ్ ఈ సినిమా కోసం విస్త్రతమైన పరిశోధన చేసింది. రియల్ స్మగ్లర్స్ తాలూకు అనుభవాల్ని కూడా తెలుసుకుంది. అక్కడి యాస, వారి నడవడిక గురించి చాలా సమాచారాన్ని సేకరించింది. స్మగ్లర్‌గా నా లుక్ ఎలా ఉండాలనే విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. ముంబయిలో పేరుపొందిన టీమ్‌ను రప్పించి నాలుగైదుసార్లు లుక్ టెస్ట్ చేశాం. అందులో ది బెస్ట్ అనిపించిన దానిని ఫైనలైజ్ చేశాం. ఈ సినిమాలోని పాత్రల్లో భిన్న వైరుధ్యాలు కనిపిస్తాయి. ఎర్రచందనం మోసుకెళ్లే కూలీలు, రవాణ చేసే మనుషులు, స్మగ్లర్లు..ఇలా ఒక్కొక్కరికి భిన్నమైన జీవన శైలి ఉంటుంది. వారి తాలూకు జీవనాన్ని సహజంగా తెరపై తీసుకు రావడానికి చాలా రీసెర్చ్ జరిగింది. నా కేశాలంకరణ, ఉపయోగించిన బట్టలు, వాడిన కొన్ని ఆభరణాల విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం.
పుష్పరాజ్ పాత్రకు నిజజీవితంలో ఎవరినైనా స్ఫూర్తిగా తీసుకున్నారా?
పుష్పరాజ్ పూర్తి కల్పిత పాత్ర. నిజజీవితంలో ఎవరితో సంబంధం ఉండదు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పుష్పరాజ్ అనే స్మగ్లర్ వ్యక్తిగత జీవితం, అతని సంఘర్షణకు దృశ్యరూపంలా ఉంటుంది.
ఓ నటుడిగా పుష్పరాజ్ పాత్ర మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపించింది?
పుష్పరాజ్ పాత్ర కంటే ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం ఎన్నో కొత్త విషయాల్ని నేర్పించింది. ఎక్కువ రోజులు అడవిలో గడపడం వల్ల కొత్తలోకంలో ఉన్న భావన కలిగింది. మేకప్ పరంగా ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు పుష్పరాజ్ క్యారెక్టర్ చాలా భిన్నమైనది. మేకప్ టెక్నిక్స్, ప్రోస్థటిక్స్ ఉపయోగించడం చూసి హాలీవుడ్లో మేకప్ గురించి ఎలాంటి టెక్నాలజీ వాడతారో తెలిసొచ్చింది. వీటితో పాటు చిత్తూరు ప్రాంతంలోని కొత్తయాసను నేర్చుకున్నా.
ఈ సినిమాకు ‘పుష్ప’ అనే పేరు ఎందుకుపెట్టారు?
తొలి నుంచి ‘పుష్ప’ టైటిల్‌కే నేను, సుకుమార్ కట్టుబడి ఉన్నాం. పుష్ప అనేది అమ్మాయి పేరు. మొండివాడైన అబ్బాయికి అలాంటి సాఫ్ట్ పేరుపెడితే కొత్తగా ఉంటుందని ఫీలయ్యాం. తొలుత టైటిల్‌ను ఒక్కటే విడుదలచేస్తే ప్రేక్షకులు కొంత నిరుత్సాహపడే అవకాశం ఉందనిపించింది. అందుకే టైటిల్‌తో పాటు నా లుక్‌ను ఒకేసారి విడుదల చేయడంతో అందరికీ నచ్చింది. పేరు, లుక్ మధ్య ఉన్న తేడా కొత్తగా అనిపించింది.
సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలనే ఆలోచన ఎప్పుడొచ్చింది?
సినిమాను ప్రారంభించే సమయంలోనే రెండు పార్ట్లు చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఒకే పార్ట్‌లో చెప్పాలనే ప్రయత్నంతో సినిమాను మొదలుపెట్టాం. షూటింగ్ ప్రారంభమైన తర్వాతే ఇలాంటి పెద్ద స్పాన్ ఉన్న కథను ఒకే భాగంలో చెప్పడం అసాధ్యమనిపించింది. రెండు భాగాలుగా తెరకెక్కిస్తేనే కథకు న్యాయం చేయగలమని భావించాం.
పుష్పరాజ్ పాత్ర కోసం సన్నద్ధమవ్వడం చాలెంజింగ్‌గా అనిపించిందా?
పుష్పరాజ్ క్యారెక్టర్ గ్రేషేడ్స్తో విభిన్నంగా ఉంటుంది. ఈ క్యారెక్టర్ కోసం మేకప్ వేసుకోవడానికి ప్రతి రోజు రెండున్నర గంటలు సమయంపట్టేది. ఆ మేకప్‌ను తొలగించడానికి చాలా కష్టమయ్యేది.
తొలిసారి ఇలాంటి రియలిస్టిక్ క్యారెక్టర్ చేశారు కదా..?
చాలా మంది నాది ఊరమాస్ క్యారెక్టర్‌గా అభివర్ణిస్తున్నారు. కానీ నేను మాత్రం నేలమాస్ పాత్ర అనుకుంటున్నా. కెరీర్లో ఇంతకంటే గొప్ప మాస్ క్యారెక్టర్ దొరుకుతుందని అనుకోవడం లేదు. సుకుమార్ స్థాయిలో మళ్లీ ఇలాంటి పాత్రను ఎవరూ సృష్టించలేరు.
సినిమాల ప్రమోషన్స్ విషయంలో ప్రతిసారి ప్లానింగ్‌తో వెళుతుంటారు. ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా అడుగులు వేస్తున్నారు?
ఈ ఏడాది ఎలాగైన ‘పుష్ప’ తొలిభాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బలంగా నిర్ణయించుకున్నాం. ఇప్పుడు కుదరకపోతే రెండు భాగాల్ని ఒకే ఏడాది విడుదలచేయాల్సివస్తుంది. పెద్ద ప్రాజెక్ట్‌ను తక్కువ సమయంలో పూర్తిచేయడం చాలెంజింగ్ అయ్యింది. నవంబర్‌లోగా సినిమాను పూర్తిచేయాలనుకున్నాం. కానీ అలా జరగలేదు. రిలీజ్‌కు ఓ వారం ముందు వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు చేయాల్సివచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న సమయంలో ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలని కష్టపడ్డాం. ఈ క్రమంలో ప్రమోషన్స్‌కు తక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది.
ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళిగారు మిమ్మల్ని ప్రశంసించడం ఎలా అనిపించింది?ఆయనతో భవిష్యత్తులో సినిమా చేసే ఆలోచన ఉందా?
ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళిగారు నిజాయితీగా మాట్లాడారు. నా గురించి ఆయన మనసులో ఉన్న మాటల్ని చెప్పారు. రాజమౌళితో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటారు. ఆ కల నాకూ ఉంది. రాజమౌళిగారిని కలిసిన చాలా సందర్భాల్లో మా మధ్య సినిమా గురించి ప్రస్తావన వచ్చింది.
ఈ మధ్యకాలంలో చాలా సినిమాల ప్రచార వేడుకలకు హాజరవుతున్నారు?
కరోనా వల్ల గత రెండేళ్లుగా ఎన్నో చిన్న చిత్రాలు, పెద్ద సినిమాలు నిలిచిపోయాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండస్ట్రీకి అండగా నిలవడం అందరికీ అవసరమనిపించింది. ‘పుష్ప’ షూటింగ్‌తో బిజీగా ఉండి కూడా విడుదలవుతున్న సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లాలని వేడుకలకు హాజరయ్యాను. నా సొంత సినిమా కంటే ఇండస్ట్రీకి సపోర్ట్‌గా నిలవడం బాధ్యతగా భావించాను.
‘అలా వైకుంఠపురం’తో ఇండస్ట్రీలో చాలా రికార్డులను తిరగరాశారు?ఈ సినిమా మీ రికార్డులను మీరే తిరగరాస్తారని అనుకోవచ్చా?
రికార్డుల గురించి మేము నేను, సుకుమార్ ఏ రోజు ఆలోచించలేదు. మొదటి రోజు నుండి హిట్ చేయాలనే సంకల్పంతో కష్టపడ్డాం. ప్రేక్షకులు మాకు ఏది ఇచ్చిన బోనస్‌గానే భావిస్తాం. సినిమాను ఏ స్థాయిలో నిలబడెతారు, ఎంత వసూళ్లు చేస్తుందనే లెక్కలు మేము ఎప్పుడూ వేసుకోలేదు.
‘అర్య’ నుంచి ఈ సినిమాకు వరకు సుకుమార్ పనితీరులో మీరు గమనించిన మార్పులేమిటి?
సుకుమార్‌లో వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు రాలేదు. ఓ సీన్ గురించి ఆలోచించే విధానం, దానిని తెరపై ఆవిష్కరించడంలో ఆయన పడే తపన ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దర్శకుడిగా మాత్రం చాలా పరిణితి వచ్చింది.
ఫహాద్ఫాజిల్ను ప్రతినాయకుడిగా ఎంచుకోవడానికి కారణమేమిటి?
భన్వర్సింగ్షేకావత్గా ఫహాద్‌ఫాజిల్ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. హీరోకు ధీటుగా ఉండే ఈ పాత్రను ఎవరూ చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి ఫహాద్‌ఫాజిల్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన ఇలాంటి పాత్రలు చేస్తారో లేదో అనుకున్నాం. అడగ్గానే తెలుగు సినిమా చేయడానికి ఆసక్తికరంగా ఉన్నానని చెప్పారాయన. కథ విని సినిమా చేయడానికి అంగీకరించారు. తన నటనతో అదరగొట్టాడు.
ట్రైలర్ చూస్తుంటే చిత్తూరు యాసలో పర్ఫెక్ట్గా మాట్లాడారని తెలుస్తున్నది?
సినిమాలో యాస చాలా ప్రామాణికంగా ఉండాలని సుకుమార్ చెప్పారు. దాంతో యాసను బాగా ప్రాక్టీస్ చేశాను. ప్రతి మాట సహజంగా ఉండాలని సుకుమార్ చెప్పేవారు.