హైదరాబాద్, ఏప్రిల్ 9 ( నమస్తే తెలంగాణ): జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణకు 19 పురస్కారాలు లభించాయి. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జిల్లా పరిషత్తు క్యాటగిరీలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతి సశక్తికరణ్ పురస్కార్ లభించింది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, వరంగల్ జిల్లా పర్వతగిరి, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలాలకు మండలస్థాయి అవార్డులు లభించాయి. గ్రామ పంచాయతీల క్యాటగిరీలో 11 గ్రామ పంచాయతీలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతి సశక్తికరణ్ పురస్కార్‌లు లభించాయి.
వీటితోపాటు వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామపంచాయతీకి చెల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతి అవార్డు లభించింది. సిద్దిపేట జిల్లా, మర్కుఖ్ మండలం ఎర్రవల్లి గ్రామ పంచాయతికి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అవార్డు దక్కింది. నారాయణ్‌పేట జిల్లా మక్తల్ మండలం మంతన్‌గోడ్ గ్రామ పంచాయతికి నానాజీ దేశ్‌ముఖ్ గౌరవ్ గ్రామసభ పురస్కార్ లభించింది. ఈ అవార్డులను ఈ నెల 24న ఢిల్లీలో అందజేయనున్నారు.
ఆయా పంచాయతీలకు ప్రశంసాపత్రంతో పాటు నగదు పురస్కారాలు బహూకరించనున్నారు. అవార్డుకు ఎంపికైన జిల్లా పరిషత్తుకు రూ.50 లక్షలు, మండల పరిషత్తుకు రూ.25 లక్షలు, గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నగదును అకౌంట్లలో జమ చేస్తారు.నిరుడు తెలంగాణకు 12 అవార్డులు లభించగా ఈసారి 19 దక్కడం రాష్ట్రం సాధించిన ప్రగతికి నిదర్శనం. రాష్ర్టానికి 19 అవార్డులు లభించడంలో పల్లెప్రగతి కార్యక్రమం కీలకపాత్ర పోషించింది. పల్లెప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన వివిధ కార్యక్రమాలు గ్రామాలను సుందరంగా, ఆహ్లాదకరంగా, పచ్చదనానికి నిలయాలుగా తీర్చిదిద్దాయి.
రాష్ర్టానికి పెద్ద ఎత్తున అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి ద్వారానే అవార్డులు లభించాయి. కేసీఆర్ దూరదృష్టి, అభివృద్ధి విజన్ ఇందుకు దోహదపడ్డాయి. ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలోని ప్రతి గ్రామానికి వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్షెడ్డు, నర్సరీ, ట్రాక్టర్ ఉన్నాయి. రాష్ట్రంలో పల్లెల్లో జరగుతున్న అభివృద్ధి పనులను గుర్తించి అవార్డులు ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అవార్డులు రావడానికి కృషిచేస్తున్న మండల, గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బంది, అధికారులకు అభినందనలు.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి
చెల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతి అవార్డు చందాపూర్
గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అవార్డు ఎర్రవల్లి
నానాజీ దేశ్‌ముఖ్ గౌరవ్ గ్రామసభ పురస్కార్ మంతన్‌గోడ్
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయతి సశక్తికరణ్ పురస్కార్
ముఖ్రాకే (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం)
వెలిచాల (కరీంనగర్ జిల్లా రామడుగు మండలం)
వెంకటాపురం (మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం)
జుక్కాపూర్ (సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం)
గుండ్లపొట్లపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మండలం)
మద్దికుంట (రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం)
నాగారం (పెద్దపల్లి జిల్లా మంథని మండలం)
మరియపురం (వరంగల్ జిల్లా గీసుకొండ మండలం)
హరిపురం ( పెద్దపల్లి జిల్లా మంథని మండలం)
మండేపల్లి (రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి)
బూర్గుపల్లి ( సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం)
జిల్లా పరిషత్తు క్యాటగిరీ: రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల క్యాటగిరీ: పెద్దపల్లి (పెద్దపల్లి జిల్లా),
తిరుమలగిరి (సూర్యాపేట జిల్లా),
పర్వతగిరి (వరంగల్ జిల్లా), కొడిమ్యాల (జగిత్యాల జిల్లా)