Youth Marries Dead Girlfriend | ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు అర్థాంతరంగా చనిపోవడాన్ని ఓ యువకుడు ఊహించుకోలేకపోయాడు. ఆమెతో జీవితాన్ని పంచుకోవాలన్న తన కల నెరవేరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ బాధలోనే ప్రేయసి మృతదేహానికి తాళి కట్టి తనపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. కడసారి ఆమెకు వీడ్కోలు పలికి గుండెలవిసేలా రోదించాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తున్న ఈ ఘటన అసోంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అసోంలోని మోరిగావ్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల బిటుపన్ తములి, కౌసువ గ్రామానికి చెందిన 24 ఏళ్ల ప్రతనా బోరా గత కొంతకాలంగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలని ఎన్నెన్నో కలలు కన్నారు. అయితే ఆ కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయి. అనారోగ్యంతో ప్రతన ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షీణించి శుక్రవారం తనువు చాలించింది.
ఈ విషయం తెలుసుకున్న బిటుపన్ ఆమె ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించాడు. కోలుకుని ఇంటికి వస్తుందనుకున్న ప్రేయసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తట్టుకోలేకపోయాడు. విగతజీవిగా పడి ఉన్న ప్రియురాలి మెడలో కుటుంబ సభ్యుల ముందే తాళి కట్టాడు. నుదిటిపై కుంకుమ బొట్టు పెట్టి, మెడలో దండ వేశాడు. ఇంతటితో ఆగకుండా ఇక జీవితంలో తాను ఎవ్వరినీ పెళ్లి చేసుకోనని, మిగిలిన జీవితాన్ని ప్రేయసితో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ఒంటరిగానే ఉంటానని శపథం చేశాడు. బిటుపన్ మనోవేదనను చూసి అక్కడున్న వారంతా చలించిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.