CM Vijay : తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ విమర్శలు చేస్తే.. బదులుగా విజయ్ వ్యక్తిగత జీవితంపై అసెంబ్లీ ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి స్టాలిన్ విమర్శలు చేశారు. భార్య చెంగల్పట్టులో భర్త కోసం వెతికే కథ తనకు తెలుసంటూ విజయ్ వ్యక్తిగత జీవితంపై స్టాలిన్ విమర్శలు చేశారు. నటుడు విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు తమిళనాడులోని చెంగల్పట్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ స్టాలిన్.. విజయ్ను విమర్శించారు.
అసెంబ్లీలో మంగళవారం విజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా నీట్, హిందీ, కరూర్ తొక్కిసలాట ఘటన వంటి అంశాలపై మాట్లాడారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సహకరించాలన్నారు. మధ్యలో ఒక చిన్న కథ కూడా చెప్పారు. ఇదే సమయంలో గతంలో అధికారంలో ఉన్న డీఎంకేపై కూడా మాట్లాడారు. గత డీఎంకే ప్రభుత్వంలోలాగా తాము అవినీతికి పాల్పడబోమన్నారు. ఒకే కుటుంబానికి ప్రాధాన్యమివ్వడం తమ రాజకీయం కాదని డీంఎకేను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అన్ని కుటుంబాలకు సేవలందిస్తామని, ఇదే తమ రాజకీయ విధానం అన్నారు. అలాగే, ఒక సందర్భంలో స్టాలిన్ బాడీ లాంగ్వేజ్‌ను విజయ్ ఇమిటేట్ చేశారు. దీనిపై అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలు అసెంబ్లీ ఔన్నత్యాన్ని తగ్గించేలా ఉన్నాయన్నారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ విజయ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.
చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం భార్య వెతికే కథ మాత్రమే తమిళనాడు ప్రజలకు తెలుసన్నారు. ఇది విజయ్, ఆయన భార్య సంగీతల విడాకుల కేసును ఉద్దేశించి చేసిన వ్యక్తిగత విమర్శ. విజయ్ నటుడిలా కాకుండా సీఎం పని చేయాలని స్టాలిన్ సూచించారు. అసెంబ్లీలో సీఎం రీల్స్ చేస్తున్నారని విమర్శించారు. అయితే, విజయ్ వ్యక్తిగత జీవితంపై స్టాలిన్ విమర్శలు చేయడం అక్కడ సంచలనంగా మారింది.