న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు ఉంచాలా లేదా ఉపసంహరించాలా అన్నది ఛాయిస్ కాదన్నారు. పెట్టుబడులు పూర్తిగా వెనక్కి తీసుకోవాలా లేక సంస్థను మూసివేయాలా అన్నది ప్రస్తుతం తమ వద్ద ఉన్న మార్గమని చెప్పారు. ఆస్తులపరంగా ఎయిర్ ఇండియాకు మొదటి రేటు ఉన్నప్పటికీ సంస్థకు 60 వేల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. ఈ రుణ భారాన్ని తప్పించడమే తమ కర్తవ్యమన్నారు.
64 రోజులలోపు బిడ్లు దాఖలు చేయాలని షార్ట్ లిస్ట్ చేసిన బిడ్డర్లకు తెలియజేయాలని గత సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఈసారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నదని, పెట్టుబడుల ఉపసంహరణలో ఎలాంటి సంకోచంలేదని వెల్లడించారు.