AIADMK : తమిళనాడు (Tamil Nadu) లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే టీవీకే అధ్యక్షుడు (TVK chief) విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకేకు మరో ఆరు సీట్లు తక్కువ పడుతున్నాయి. విజయ్‌కి కాంగ్రెస్ పార్టీ (Congress Party) మాత్రమే మద్దతు పలికింది. వీసీకే, సీపీఐ, సీపీఐ (ఎం), ఐయూఎంఎల్ లాంటి చిన్న పార్టీలు మాత్రం టీవీకేకు మద్దతిచ్చేందుకు ససేమీరా అంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్‌కి అన్నాడీఎంకే (AIADMK) మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని అన్నాడీఎంకే పార్టీ కొట్టిపారేసింది.
అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుసామి బుధవారం సాయంత్రం మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్‌కి కావాల్సిన స్థానాలు, వచ్చాయా లేదా అనే అంశంతో తమకు సంబంధం లేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీకేకు అన్నాడీఎంకే సహకరించదని స్పష్టంచేశారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు అవసరం. కాంగ్రెస్ పార్టీ డీఎంకేను పక్కన పెట్టి, విజయ్‌కి మద్దతిస్తోంది.
అయినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మరికొందరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతివ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అన్నాడీఎంకేకు 47 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. సుమారు 30 మంది విజయ్‌తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్‌తో కలిసేందుకు పార్టీ అధినేత పళనిసామి మాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ డిప్యూటీ కోఆర్డినేటర్ మునుసామి నుంచి పై ప్రకటన వెలువడింది.