వారణాసి: టమాట..! ఇది మార్కెట్లో మాంచి డిమాండ్ ఉన్న కూరగాయ..! ఎందుకంటే పప్పులు, ఆకు కూరలతోపాటు ఇతర ఏ కూరగాయలతోనైనా టమాట కాంబినేషన్ అదిరిపోద్ది..! అందుకే టమాటకు అంత క్రేజ్..! అలాగని ధర భారీగా ఉంటుందనుకునేరు..! అదేం లేదు..! లభ్యతను బట్టి సాధారణంగా అయితే కిలో రూ.10 నుంచి రూ.40 మధ్యే దొరుకుతుంది..! దిగుబడి ఎక్కువగా ఉన్నప్పుడైతే రూపాయికి కిలో ఇచ్చినా కొనే దిక్కుండదు..! అదేవిధంగా అతివృష్టి, అనావృష్టి దెబ్బ పడిందంటే టమాట ధరలు చుక్కలను అంటుతాయి..!
ప్రస్తుతం దేశంలో అదే పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో టమాట పంట మురిగిపోయింది. దాంతో దిగుబడి భారీగా తగ్గిపోయింది. దిగుబడి తగ్గడంతో టమాటల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కిలో టమాట రూ.150 నుంచి రూ.200 మధ్య ధర పలుకుతున్నది. ఈ నేపథ్యంలో టమాటలకు సంబంధించి రకరకాల వింతలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నగరంలో అలాంటి వింత దృశ్యమే ఆవిష్కృతమైంది. తన దగ్గరున్న టమాటల రక్షణ కోసం ఓ కూరగాయల వ్యాపారి ఏకంగా బౌన్సర్లను నియమించుకున్నాడు.
ఇదెక్కడి కథ అని మీడియా ప్రశ్నించగా.. గత కొన్ని రోజులుగా టమాట ధరలు పెరుగుతూ వచ్చాయని, దాంతో టమాటలు కొనేందుకు వచ్చే కస్టమర్లతో రోజూ గొడవలు జరుగుతున్నాయని, కొందరు గొడవపడి టమాటలు ఎత్తుకెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆ కూరగాయల వ్యాపారి అజయ్ ఫౌజి చెప్పాడు. రోజూ కస్టమర్లతో గొడవలు పడటం ఇష్టం లేకనే తాను బౌన్సర్లను నియమించుకున్నట్లు తెలిపాడు. ఇవాళ కిలో టమాట రూ.160 ధర పలుకుతోందని, అంత ధరలు భరించలేక కొందరు 50 గ్రాములు, 100 గ్రాముల టమాటలు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించాడు. కాగా, ఫౌజీ కూరగాయల మడిగె ముందు బౌన్సర్లు కాపలా కాస్తున్న దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు..
VIDEO | A vegetable vendor in Varanasi, UP has hired bouncers to keep customers at bay when they come to buy tomatoes, whose price has increased massively over the past few days. “I have hired bouncers because the tomato price is too high. People are indulging in violence and… pic.twitter.com/qLpO86i9Ux
— Press Trust of India (@PTI_News) July 9, 2023