న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా(United States) భీకరంగా దాడి చేస్తున్న విషయం తెలిసిందే. విధ్వంసకర పేలుడు పదార్ధాలు, క్షిపణులను ఆ దేశం వినియోగిస్తున్నది. చాలా ఖరీదైన ఆ ఆయుధాల వల్ల.. అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నది. ఇరాన్ వార్ కోసం అమెరికా ఖర్చు చేస్తున్న గణాంకాలను పరిశీలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇరాన్ వార్ కోసం ప్రతి సెకనుకు అమెరికా సుమారు 9.8 లక్షలు(10వేల డాలర్లు) ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం యుద్ధం 31వ రోజుకు చేరుకున్నది. అమెరికా పన్నుదారులకు చెందిన సుమారు 2.63 లక్షల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ విషయాన్ని చెప్పారు. ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన యుద్ధం ప్రస్తుతం భీకర స్థాయికి చేరుకున్నది.
ఈ యుద్ధం కోసం ప్రతి రోజు అమెరికా ప్రభుత్వం దాదాపు 8455 కోట్లు(890 మిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తున్నది. పేలుడు పదార్ధాలు, ఎయిర్ ఆపరేషన్స్, నేవీ డిప్లాయ్‌మెంట్, మిస్సైల్ డిఫెన్స్, ఇంటెలిజెన్స్, లాజిస్టిక్స్‌తో అన్ని ఖర్చులు లెక్కేస్తున్నారు. ఎస్ఐపీఆర్ఐ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మునిషన్స్, మిస్సైళ్లకు ఎక్కువ ఖర్చు అవుతోంది. ప్రతి రోజు వాటి కోసం సుమారు 3040 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం ఖర్చులో అది 36 శాతంగా ఉంది. తోమాహాక్ క్రూయిజ్ మిస్సైళ్లు, జేడీఏఎం బాంబులు, ప్రిసిషన్ గైడెడ్ బాంబులు ఉన్నాయి.
వైమానిక ఆపరేషన్స్ కోసం ప్రతి రోజు సుమారు 2327.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోజు వారి ఖర్చులో ఇది 27.5 శాతంగా ఉంది. నౌకాదళ ఆపరేషన్స్ కోసం ప్రతి రోజు సుమారు 1475 కోట్లు ఖర్చు చేస్తున్నారు. యుద్ధ నౌకల మోహరింపు, డెస్ట్రాయర్లు, సబ్మెరైన్లు ఈ జాబితాలో ఉన్నాయి. మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ థాడ్, పాట్రియాట్, ఏజిష్ బీఎండీ కోసం ప్రతి రోజు సుమారు 902 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇది రోజువారీ ఖర్చులో 11 శాతంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇంటెలిజెన్స్, సైబర్ ఆపరేషన్స్ కోసం 427 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఐఎస్ఆర్ ప్లాట్‌ఫామ్స్, శాటిలైట్ ఇమేజ్‌లు, సైబర్ ఆపరేషన్స్ దీంట్లో ఉన్నాయి.
పర్సనల్, లాజిస్టిక్స్ కోసం ప్రతి రోజు 285 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇరాన్‌పై యుద్ధం ఖర్చు మితిమీరిన నేపథ్యంలో.. ఈ అంశంపై గల్ఫ్ దేశాలతో అమెరికా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధ ఖర్చుల్లో గల్ఫ్ దేశాల సహాయాన్ని అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయి. 1990లో జరిగిన గల్ప్ వార్ సమయంలో జపాన్, జర్మనీ దేశాలు అమెరికాకు సాయం చేశాయి. ప్రస్తుతం తమకు నష్ట పరిహారం చెల్లించాలని ఇరాన్ కూడా డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలను అమెరికా సాయం కోరే ఛాన్సు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.