న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ (CJI Chandrachud) ముందు రెండు విస్కీ బాటిల్స్ (whisky bottles) ఉంచారు. ఇది చూసిన ఆయన గట్టిగా నవ్వారు. ఈ బాటిల్స్ మీరు తెచ్చారా? అని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీని ప్రశ్నించారు. రెండు మద్యం కంపెనీల మధ్య ట్రేడ్ మార్క్ ఉల్లంఘన వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్ప్రైజెస్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. అయితే తమ కంపెనీ ‘బ్లెండర్స్ ప్రైడ్’ ట్రేడ్‌మార్క్ ‘ఇంపీరియల్ బ్లూ’ బాటిల్ రూపాన్ని జేకే ఎంటర్ప్రైజెస్ ఉల్లంఘించిందని మరో మద్యం తయారీ కంపెనీ పెర్నోడ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో జేకే ఎంటర్‌ప్రైజెస్‌పై తాత్కాలికంగా నిషేధం విధించాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై పెర్నోడ్ కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై శుక్రవారం విచారణ జరిపింది. రెండు ఉత్పత్తులను కోర్టులోకి తీసుకురావడానికి అనుమతించాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ, ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
అనంతరం రెండు మద్యం బాటిళ్లను తన టేబుల్‌పై ఉంచి వాదనలు వినిపించారు.
మరోవైపు సుప్రీంకోర్టులో రెండు విస్కీ బాటిల్స్ చూసిన సీజేఐ చంద్రచూడ్ బిగ్గరగా నవ్వారు. ‘ఈ సీసాలు మీతోపాటు తీసుకువచ్చారా?’ అని సీనియర్ న్యాయవాది ముకుల్‌ను అడిగారు. అవునని బదులిచ్చిన ఆయన రెండు ఉత్పత్తుల మధ్య సారూప్యతను చూపించడానికి వాటిని తెచ్చినట్లు చెప్పారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన ఎలా జరిగిందో అన్నది ఆయన వివరించారు. దీంతో గతంలో ఇలాంటి తరహా కేసు విచారణ గురించి సీజేఐ చంద్రచూడ్ ప్రస్తావించారు.
కాగా, వాదనల తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్టే విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అనంతరం ఈ బాటిల్స్ తీసుకెళ్లతారా? అని సీజేఐ చంద్రచూడ్‌ను సీనియర్ న్యాయవాది ముకుల్ సరదాగా అడిగారు. దీనికి ఆయన నవ్వుతూ ‘ఎస్ ప్లీజ్’ అని అన్నారు.