సిర్సా: తుపాకీ కల్చర్ గతంలో పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు మన దేశంలోనూ ఈ కల్చర్ పెరిగిపోతున్నది. సంబరాల్లో గాల్లోకి కాల్పులు జరపడం, గొడవలు జరిగితే ప్రత్యర్థులను కాల్చిచంపడం లాంటి వాటిని ఈ మధ్యకాలంలో మన దేశంలో కూడా ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉన్నాం. తాజాగా హర్యానా రాష్ట్రం సిర్సా జిల్లా కలాన్వాలి ఏరియాలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
సోమవారం రాత్రి కారులో కలాన్వాలి ఏరియాకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. అక్కడ మరో కారులో ఉన్న వ్యక్తులే లక్ష్యంగా విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు, పోలీసుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు.
కాల్పులకు జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న వివరాల ప్రకారం.. ముందుగా రెండు కార్లలోని వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఒక కారులోని వ్యక్తులు మరో కారులోని వ్యక్తులపై కాల్పులు జరిపిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా ప్రాంతంలో లభ్యమైన సీసీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతున్నదని సిర్సా ఎస్పీ అర్పిత్ జైన్ చెప్పారు.