Bengaluru : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో బుధవారం ఉదయం ట్రాన్స్ఫార్మర్ (Transformer) పేలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. అమెజాన్ కార్యాలయం (Amazon Office) సమీపంలో ఉన్న ఒక విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి గాయపడగా స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. బాగలూరు (Bagaluru) క్రాస్ వద్ద ఉదయం 9:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా సమీపంలోని విద్యుత్ రింగ్ మెయిన్ యూనిట్ (RMU) భారీ శబ్దంతో పేలింది. ఈ ధాటికి అఫ్రోజ్ కిందపడిపోగా వెంటనే స్పందించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగా ఉన్నాడని, ప్రాణాపాయం తప్పిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన యలహంక ఓల్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఈ ప్రమాదంపై బెంగళూరు విద్యుత్ సరఫరా కంపెనీ అధికారులు స్పందించారు. మీడియం-వోల్టేజ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లోని భాగమైన రింగ్ మెయిన్ యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తిందని, ఇలాంటి పేలుళ్లు చాలా అరుదుగా సంభవిస్తాయని తెలిపారు. తమ సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో కొంతసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.