న్యూఢిల్లీ: మహిళా ఎంపీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడైన ఆయనను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. (TMC MP Kalyan Banerjee) బుధవారం ఉదయం విపక్షాల ఆందోళన కారణంగా లోక్‌సభ వాయిదా పడింది. ఈ సందర్భంగా టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఎన్సీపీఐలో చేరిన టీఎంసీ రెబల్స్ ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. ఏమి జరిగిందని మిగతా ప్రతిపక్ష ఎంపీలు ఆరా తీసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంపీ కల్యాణ్ బెనర్జీ సభ నుంచి వెళ్లిపోయారు.
కాగా, మహిళా ఎంపీలు మితాలి బాగ్, శతాబ్ది రాయ్, కాకోలి ఘోష్ దస్తీదార్పై ఎంపీ కల్యాణ్ బెనర్జీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఎన్సీపీఐ సభ్యులు ఆరోపించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆయన ఛాంబర్లో కలిసి ఫిర్యాదు చేశారు.
మరోవైపు రెండో వాయిదా తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ సమావేశమైంది. సభకు అధ్యక్షత వహించిన కృష్ణ ప్రసాద్ తెన్నెటికి, కల్యాణ్ బెనర్జీపై స్పీకర్‌కు చేసిన ఫిర్యాదును ఎన్సీపీఐ సభ్యులు ప్రస్తావించారు. ఆయన వ్యాఖ్యలు సభ గౌరవాన్ని దెబ్బతీశాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేయడానికి సభ ఆమోదం కోరుతూ ఒక తీర్మానాన్ని చదివి వినిపించమని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కృష్ణ ప్రసాద్ కోరారు. నీట్ పేపర్ లీక్, ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా మూజువాణి ఓటుతో ఆ తీర్మానం ఆమోదం పొందింది. దీంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసే ఆగస్ట్ 13 వరకు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు.