Bengal Tiger | గ్యాంగ్టక్, డిసెంబర్ 10: సిక్కింలోని పంగలోఖ వన్య ప్రాణుల అభయారణ్యంలో 3,640 మీటర్ల ఎత్తులో ఒక బెంగాల్ టైగర్ కనిపించిందని అధికారులు తెలిపారు. సిక్కిం, బెంగాల్, భూటాన్ల కేంద్రంగా ఉన్న ఈ వన్య ప్రాణుల అభయారణ్యం 128 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సిక్కింలోనే అతి పెద్దదైన ఈ అభయారణ్యంలో జంతువులపై పరిశోధనలు సాగించే బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కెమెరాలకు ఈ బెంగాల్ టైగర్ చిక్కింది.
ఒక టైగర్ 3,640 మీటర్లు (11,942 అడుగులు) ఎత్తులో కన్పించడం ఇదే ప్రథమమని వెల్లడించారు. సిక్కిం హిమాలయాలలోని ఇంత ఎత్తయిన ప్రదేశంలో టైగర్ కదలికలు చూస్తుంటే పులి సంచారం గురించి లోతైన అవగాహన అవసరమని, అంతేకాకుండా దీనిపై మరింత విస్తృత పరిశోధనలుచేపట్టాలని అవగతమవుతున్నదని పరిశోధకులు అథర్వసింగ్ అభిప్రాయపడ్డారు.