న్యూఢిల్లీ, మే 15: విద్యుత్తు కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లకు సంబంధించి కేంద్ర విద్యుత్తు శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఇంతకాలం 25 ఏండ్లకు కుదుర్చుకుంటున్న దీర్ఘకాలిక విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను ఇక నుంచి 12 – 15 ఏండ్లకే పరిమితం చేయాలనే యోచనతో ఉన్నట్టు విద్యుత్తు శాఖలోని సీనియర్ అధికారులు తెలిపారు. భారత విద్యుత్తు మార్కెట్‌ను పునరుద్ధరించడానికి ప్రవేశపెట్టబోయే మార్పుల్లో ఈ నిర్ణయం కూడా ఒకటని తెలిపారు. దేశంలో విద్యుత్తు మార్కెట్ అభివృద్ధి కోసం కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ నేతృత్వంలోని బృందం పీపీఏల ఒప్పంద గడువు తగ్గించాలనే సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, ప్రస్తుతానికి ఇది చర్చల దశలోనే ఉందని, త్వరలోనే సమగ్ర విధానంతో ఈ మార్పులను అమలు చేయనున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్తు వనరుల్లో ఏడు శాతం మాత్రమే కలిగి ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వాటాను పెంచుకోవాలని అనుకుంటున్నది. ఇందులో భాగంగానే పలు మార్పులు తీసుకువస్తున్నది.