Tamil Politics : ఇటీవల జరిగిన తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నటుడు విజయ్ (Actor Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు ఇచ్చేందుకు వామపక్ష పార్టీలు (Left Parties) ముందుకు వచ్చాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామే తప్ప, కేబినెట్లో చేరి మంత్రి పదవులు చేపట్టబోమని స్పష్టంచేశాయి.
టీవీకే పార్టీకి బయటి నుంచే మద్దతు ఇస్తామని ఉద్ఘాటించాయి. రాష్ట్రంలో మతవాద శక్తులు పాగా వేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు వామపక్షాలు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా మతతత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అదే సమయంలో తమ చిరకాల మిత్రపక్షమైన డీఎంకేతో బంధం కొనసాగుతుందని వామపక్షాలు స్పష్టంచేశాయి. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎంకేతో కలిసి పనిచేస్తామని తెలిపాయి.