Deepak Prakash : బిహార్ మంత్రిగా ఉన్న యువ నేత దీపక్ ప్రకాష్‌కు పదవీ గండం పొంచి ఉంది. ఆయనకు శాసన సభ, మండలిలో ఎలాంటి సభ్యత్వం లేకుండానే ఆరు నెలలకుపైగా మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అది కూడా క్యాబినెట్ మంత్రిగా. ఈ నేపథ్యంలో ఆయన పదవిలో కొనసాగడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని కోరింది. బిహార్‌కు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎమ్) పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహా తనయుడు దీపక్ ప్రకాష్.
ప్రస్తుతం ఉపేంద్ర రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, దీపక్ ప్రకాష్ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం బిహార్‌లో సామ్రాట్ చౌదరి సీఎంగా, ఎన్డీయే ఆధ్వర్యంలోని ఉమ్మడి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కూటమిలో ఆర్ఎల్ఎమ్ భాగస్వామిగా ఉంది. అందుకే ఆ పార్టీ అధినేత ఉపేంద్ర తనయుడు దీపక్ ప్రకాష్‌కు అప్పుడు నితీష్ ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లో దీపక్ ప్రకాష్ క్యాబినెట్ మంత్రి (పంచాయతీ రాజ్ శాఖ)గా పదవి చేపట్టారు. తర్వాత నితీష్ నుంచి బీజేపీకి చెందిన సామ్రాట్ సీఎం పదవి చేపట్టినప్పటికీ.. దీపక్ ప్రకాష్ మంత్రి పదవి మాత్రం అలాగే ఉంది. కొత్త మంత్రివర్గంలో ఆయనను తిరిగి నియమించారు. అయితే, ఆయనకు సభలో, శాసన మండలిలో ఎలాంటి సభ్యత్వం లేదు. అటు ఎమ్మెల్యే, ఇటు ఎమ్సెల్సీ.. రెండూ కాదు. రాజ్యంగం ప్రకారం చట్టసభల్లో ఏ సభ్యత్వం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టడం కుదరదు. అలా, ఆరు నెలల కంటే ఎక్కువ కాలం మంత్రి పదవిలో కొనసాగడానికి వీల్లేదు. వరుసగా ఆరు నెలలు పదవి పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మంత్రి పదవి దక్కించుకోవాలంటే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలి.
కానీ, దీపక్ మాత్రం సభ్యత్వం లేకుండానే మంత్రిగా ఉండటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వీ మోహన ఆధ్వర్యంలోని బెంచ్ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. దీపక్ విషయంలో స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ఈసీ నుంచి స్పందన వచ్చిన అనంతరం ఆయన పదవిలో కొనసాగడంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది. పైగా ఇప్పట్లో అక్కడ ఎన్నికలేమీ లేవు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో దీపక్‌కు పదవీ గండం తప్పేలా లేదు.