తిరువనంతపురం, మే 7 : కొత్తగా ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే అయిష్టత, అసౌకర్యం వ్యక్తపరుసున్నా సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఆమెను బహిరంగంగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించిన ఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రధాన కార్యాలయంలో లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశానికి విచ్చేసిన కొల్లం ఎమ్మెల్యే బిందు కృష్ణను పలువురు అభినందించారు. ఈ క్రమంలో ఆమెను అభినందిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ ఆమెను హగ్ చేసుకోవడానికి ప్రయత్నించగా, ఆమె అడ్డుకుంది.
ఇతర పార్టీ నేతలు, పాత్రికేయుల ఎదుటే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా చెరియన్ ఫిలిప్ చర్యను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎమ్మెల్యే అసౌకర్యంగా ఫీలవుతున్నా ఫిలిప్ పట్టించుకోకుండా ఇదేం పనని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. సిగ్గులేకుండా ప్రవర్తించిన ఈ 71 ఏండ్ల నేతపై వెంటనే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.