భోపాల్, సెప్టెంబర్ 13: మూడేండ్ల చిన్నారిపై స్కూల్ బస్ డ్రైవర్ లైంగికదాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చోటుచేసుకొన్నది. గత గురువారం బస్సులోనే ఈ ఘాతుకం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సులోనే ఉన్న మరో మహిళ అతడికి సాయం చేసిందని, ఆమెను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.
పాప ఇంటికి వచ్చినప్పుడు ఆమె దుస్తులను ఎవరో మార్చినట్టు తల్లి దృష్టికి వచ్చింది. మామూలుగా వేసుకొనే దుస్తులను తొలగించి బ్యాగులో పెట్టి వేరే దుస్తులను తొడిగారని తెలుసుకొన్న తల్లి స్కూల్ యాజమాన్యాన్ని సంప్రదించింది. తాము పాప దుస్తులు మార్చలేదని క్లాస్ టీచర్ చెప్పారు. ఆ చిన్నారిని అడగ్గా డ్రైవర్ లైంగికదాడి చేసి, దుస్తులు మార్చినట్టు తెలిపింది.