భోపాల్ : భిక్షాటన చేస్తున్న సాధువును ఓ వ్యక్తి తీవ్రంగా కొట్టి జుట్టు కత్తిరించిన ఉదంతం మధ్యప్రదేశ్లోని పతజన్ గ్రామంలో వెలుగుచూసింది. సాధువును ఓ వ్యక్తి వేధిస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సాధువును ఓ వ్యక్తి కొడుతూ ఆపై జుట్టు కత్తిరించిన దృశ్యాలు కనిపించాయి. సాధువు జుట్టు కత్తిరించి వేధింపులకు పాల్పడిన వ్యక్తిని ప్రవీణ్ గౌర్గా గుర్తించారు.
సాధువు భిక్షాటనకు వచ్చిన సమయంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని సమాచారం. సాధువుపై నిందితుడు ఎందుకు దాడికి పాల్పడ్డాడనే వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తదుపరి దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు.