బెంగళూరు: హెడ్లైట్లు పనిచేయకపోవడంతో కండక్టర్ ఫోన్ టార్చ్ వెలుతురు ద్వారా దారి చూపించడంతో కర్ణాటకకు చెందిన కల్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (కేకేఆర్టీసీ)డ్రైవర్ బస్సును నడిపిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. కలబురిగి నగరం నుంచి చించోలి ఆఖరి బస్ సర్వీస్‌లో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్లైట్లు పోవడంతో చిమ్మచీకటిగా మారిన రోడ్‌పై కండక్టర్ ఫోన్ టార్చ్ ద్వారా దారి చూపడంతో డ్రైవర్ బస్‌ను నెమ్మదిగా నడిపి 90 కి.మీ దూరంలోని గమ్యస్థానానికి చేర్చడం వీడియోలో కన్పించింది.
బస్‌లోని ప్రయాణికుడొకరు దీనిని వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టడంతో అది వైరల్ అయ్యింది. బస్సు లైట్లు ఎప్పుడు పాడయ్యాయో వివరాలు తెలియరాలేదు. ఈ వీడియోను చూసి విధి నిర్వహణలో కండక్టర్, డ్రైవర్ల చిత్తశుద్ధిని కొందరు ప్రశంసించగా, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడారంటూ చాలామంది విమర్శించారు.