Rabbit R1 | హైదరాబాద్, జనవరి 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ల్యాండ్‌లైన్ ఫోన్, వాచ్, క్యాలిక్యులేటర్, కెమెరా, ఎఫ్ఎం రేడియో, టీవీలకు ప్రత్యామ్నాయంగా మారిన స్మార్ట్‌ఫోన్‌కు కూడా ఇక కాలం చెల్లిపోనున్నదా? స్మార్ట్‌ఫోన్‌కు చెక్ పెట్టేలా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే అధునాతన డివైజ్‌లను టెక్ కంపెనీలు తీసుకొస్తుండటమే దీనికి కారణం. ఇప్పటికే, రేబ్యాన్ ప్రత్యేక గ్లాసెస్, హ్యుమానే ‘ఏఐ పిన్’ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయ సేవలను అందిస్తుండగా ఇప్పుడు అమెరికా స్టార్టప్ కంపెనీ ర్యాబిట్ మరో సరికొత్త ఏఐ డివైజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ర్యాబిట్ ఆర్1’గా పిలుస్తున్న ఈ డివైజ్ ఎంచక్కా పాకెట్లో ఇమిడిపోతుంది. విడుదల రోజే ఈ డివైజ్‌ను 10 వేల మంది బుకింగ్ చేసుకొన్నారంటే దీని క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఏదైనా ఆహారం ఆర్డర్ ఇవ్వాలంటే ఫుడ్ యాప్స్ ఫోన్లో ఉండాలి. ఎక్కడికైనా వెళ్లాలంటే క్యాబ్ బుకింగ్స్‌కి యాప్ తప్పనిసరి. బ్యాంకింగ్, గేమ్స్, ఎంటైర్టెన్మెంట్ ఇలా ఏది కావాలన్నా ఫోన్లో యాప్స్ తప్పనిసరి. అయితే, ఇవేమీ అవసరం లేకుండా వాయిస్ అసిస్టెంట్‌తో అవసరమేంటో చెప్పగానే.. అడిగిన సేవలు క్షణాల్లో లభిస్తే ఎంత బాగుంటుంది. సరిగ్గా ఇలాంటి అవసరాలను తీర్చడానికి తీసుకొచ్చిందే.. ర్యాబిట్ ‘ఆర్1’. ఈ గ్యాడ్జెట్ ‘లార్జ్ యాక్షన్ మాడల్’ అనే ఏఐ సిస్టమ్ ఆధారంగా ర్యాబిట్ ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఫోన్లో ఉన్నట్టే డిస్ప్లే స్క్రీన్, కెమెరా, మైక్రోఫోన్ దీంట్లో ఉన్నాయి. ఈ డివైజ్‌తో కాల్స్ చేయొచ్చు. మెసేజీలు పంపొచ్చు. ఫొటోలు, వీడియోలు తీయొచ్చు.
బ్రౌజింగ్ కూడా చేయొచ్చు. లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్, మ్యూజిక్ సిస్టమ్, ట్యాబ్ పనితీరు, వర్చువల్ అసిస్టెంట్ ఇలా ఒక్కటేమిటీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న దానికంటే ఇంకా ఎక్కువే ఫీచర్లు ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఫీచర్లను వాడాలంటే ప్రత్యేకంగా యాప్స్ కూడా అవసరం లేదు. లోకల్ ల్యాంగ్వేజీలో కమాండ్స్ ఇస్తే సరిపోతుంది. అవసరమైన పనులను ఈ డివైజ్ చేసిపెడుతుంది. 2.3 గిగాహెర్జ్ మీడియా టెక్ హీలియో పీ35 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, సిమ్ స్లాట్, యూఎస్బీ-సీ కనెక్టివిటీ, ఆల్డే బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లతో ఈ డివైజ్‌ను ఇటీవలే ఆవిష్కరించారు. ధర 199 డాలర్లుగా (రూ. 16,529) నిర్ణయించారు. ఈ డివైజ్ సహాయంతో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను మనం ఉన్నచోట నుంచే కంట్రోల్ కూడా చేయొచ్చు.
స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా వాడుకొనేలా అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ హ్యుమానే ‘ఏఐ పిన్’ డివైజ్‌ను గత నవంబర్‌లో తీసుకొచ్చింది. ‘ర్యాబిట్ ఆర్1’లో ఉన్న అన్ని ఫీచర్లు ‘ఏఐ పిన్’లోనూ ఉన్నప్పటికీ డిస్ప్లే స్క్రీన్ మాత్రం ‘ఏఐ పిన్’లో లేదు. అలాగే ధర విషయంలోనూ రెండు గ్యాడ్జెట్ల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తున్నది. ‘ర్యాబిట్ ఆర్1’ డివైజ్ 199 డాలర్లకు లభిస్తుండగా.. ‘ఏఐ పిన్’ ధర 699 డాలర్లుగా ఉన్నది. దీంతో కొంత ఆలస్యంగా వచ్చినప్పటికీ, ‘ఏఐ పిన్’కు ‘ర్యాబిట్ ఆర్1’ గట్టిపోటీనిచ్చే అవకాశమున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు.